పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరగడాలంటే.. వారికి అదేపనిగా చెప్పించడం కాదు. మీరు వారిపట్ల చూపే ప్రేమతోనే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మరి అదేలాగో తెలుసుకుందాం..
చిన్నారులతో మాట్లాడేటప్పుడు వారి కళ్లల్లోకి చూడాలి. అప్పుడే మీ ప్రేమ వారికి అర్థమవుతుంది. ముఖ్యంగా వారిని కూడా అలానే మాట్లాడించాలి. ఇలా చేయడం వలన వారిలో ఆత్మవిశ్వాసం కాస్తైనా పెరుగుతుంది.
పిల్లలు విసిగించినప్పుడూ, ఇబ్బంది పెడుతున్నప్పుడూ తల్లిదండ్రులు చేసేపని.. నాలుగు దెబ్బలు వేయడం లేదా గట్టిగా కోప్పడడం. ఇలా చేయడం వలన వాళ్లు మరింతి మొండిగా తయారవుతారు తప్ప మీ మాట అస్సలు వినరు. అందుకే ఆ సమయంలో మీరు కాసేపు మౌనంగా ఉండండి.. తరువాత నిదానంగా చెప్పండి.. అప్పుడే వాళ్ల గురించి వాళ్లకే తెలుస్తుంది.
తల్లిదండ్రులు పిల్లలకు అన్నివేళలా తోడుంటామనే మానసిక ధైర్యాన్ని పెంచాలి. వాళ్లు ఏ మాత్రం నిరుత్సాహంగా ఉన్నా దగ్గరకు తీసుకుని కబుర్లు చెప్పాలి. ఒక్కమాటలో చెప్పాలంటే.. మీ ప్రేమను స్పర్శద్వారా వారికి తెలియజేయాలి. ఇది వారిలో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తుంది.