కాసుల వర్షం కురిపించే ఐపీఎల్ 14 సీజన్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరఫున ఆడాలని ఉందని ఆస్ట్రేలియా క్రికెటర్ గ్లెన్ మాక్స్వెల్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈసారి ఆర్సీబీతో ఆడేందుకు సిద్ధమని చెప్పాడు. తనకిష్టమైన డివిలియర్స్, కోహ్లీతో పనిచేయడం హ్యాపీగా వుందని చెప్పాడు.
వాళిద్దరితో తనకు మంచి అనుబంధం ఉందని, కోహ్లీతో బాగా కలిసిపోతానని చెప్పాడు. 'విరాట్ సారథ్యంలో ఆడటం, అతడితో కలిసి బ్యాటింగ్ చేయడం నాకెంతో ఇష్టం. అతడితో త్వరగా కలిసిపోతా. ఎప్పుడు కలిసినా కోహ్లీ ఏదో ఒక విషయంలో సాయపడుతుంటాడు. అతడో అత్యుత్తమ క్రికెటర్. కాబట్టి కోహ్లీతో కలిసి ఆడటం చాలా బాగుంటుంది' అని మాక్సీ పేర్కొన్నాడు.
కాగా, మరో మూడు రోజుల్లో జరగనున్న 14వ సీజన్ వేలంలో ఆర్సీబీ.. మాక్స్‌వెల్‌ను తీసుకుంటుందా లేదా చూడాలి. ఇప్పటికే ఆ జట్టు జనవరిలో అత్యధికంగా 10 మంది ఆటగాళ్లను వదిలేసింది. గతేడాది యూఏఈలో జరిగిన మెగా ఈవెంట్లో పంజాబ్ తరఫున ఆడిన అతడు 13 మ్యాచ్‌ల్లో కేవలం 108 పరుగులే చేశాడు.
రూ.10.75 కోట్లు వెచ్చించి మరీ తీసుకున్న ఆ జట్టు అంచనాలను తలకిందులు చేశాడు. దీంతో అతడి ప్రదర్శనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే పంజాబ్ తర్వాతి సీజన్‌కు అతడిని వదిలేసింది.