Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చెన్నైకి తప్పని టెన్షన్.. ఫైనల్ పోరులో కోల్‌కతాతో గెలుస్తుందా?

Advertiesment
IPL 2021 Final
, గురువారం, 14 అక్టోబరు 2021 (19:24 IST)
ఐపీఎల్-2021 తుది అంకానికి చేరుకుంది. ఫైనల్ పోరులో చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు అమితుమీ తేల్చుకోనున్నాయి. ఈ రెండు జట్ల మధ్య దుబాయ్ వేదికగా శుక్రవారం రాత్రి 7.30 గంటలకి మ్యాచ్ ఆరంభం కానుండగా.. టాస్ 7 గంటలకు పడనుంది. క్వాలిఫయర్-1లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుపై గెలిచిన చెన్నై నేరుగా ఫైనల్‌కి చేరింది. 
 
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు‌ని ఎలిమినేటర్‌లో, ఢిల్లీ క్యాపిటల్స్‌ని క్వాలిఫయర్-2లో ఓడించిన కోల్‌కతా ఫైనల్‌కి అర్హత సాధించింది. లీగ్ దశలో చెన్నై వరుస ఓటములను ఎదుర్కొనగా.. కోల్‌కతా మాత్రం వరుస విజయాలతో సత్తాచాటింది. దాంతో చెన్నైతో పోలిస్తే.. కోల్‌కతా ఇప్పుడు మంచి ట్రాక్‌లో కనిపిస్తోంది.
 
14 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్‌కి చేరడం ఇది తొమ్మిదోసారి కాగా.. ఇప్పటికే మూడు సార్లు టైటిల్ గెలిచింది. ఇక కోల్‌కతా నైట్ రైడర్స్ ఫైనల్‌కి చేరడం ఇది మూడో సారికాగా.. రెండు సార్లూ టైటిల్ విజేతగా నిలిచింది. ఇప్పుడు ఈ ట్రాక్ రికార్డే చెన్నైలో టెన్షన్ పెంచుతోంది.
 
ఐపీఎల్ ఫైనల్లో ఇప్పటి వరకూ కేవలం ఒకే ఒక సందర్భంలో చెన్నై, కోల్‌కతా జట్లు ఢీకొన్నాయి. 2012లో కోల్‌కతా.. చేపాక్ వేదికగా జరిగిన ఫైనల్లో చెన్నైపై 5 వికెట్ల తేడాతో ఓడించింది. 2014లోనూ ఫైనల్‌కి చేరిన కోల్‌కతా.. పంజాబ్ కింగ్స్‌పై 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. దాంతో మూడోసారి కూడా అజేయ ఫైనల్‌ రికార్డుని కొనసాగించాలని కోల్‌కతా చూస్తోంది. 
 
ఫైనల్ వచ్చిన రెండుసార్లు కోల్‌కతా టైటిల్ గెలవడమే ఇప్పుడు చెన్నైని కలవరపెడుతోంది. ఐపీఎల్ టోర్నీలో ఇప్పటివరకూ చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు 27 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో 17 మ్యాచ్‌ల్లో చెన్నై విజయం సాధించగా.. 9 మ్యాచ్‌ల్లో కోల్‌కతా గెలుపొందింది.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత స్ప్రింటర్ హిమాదాస్‌కు కరోనా పాజిటివ్