దుబాయ్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ 6వ మ్యాచ్‌లో రాయల్స్ చాలెంజర్స్ బెంగళూరుపై కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఘన విజయం సాధించింది. బెంగళూరుపై పంజాబ్ 97 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. పంజాబ్ నిర్దేశించిన 207 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బెంగళూరు బ్యాట్స్‌మెన్ తేలిపోయారు. ఎప్పటికప్పుడు వికెట్లను కోల్పోయారు. దీంతో పంజాబ్ సునాయాసంగా విజయం సాధించింది.
మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా పంజాబ్ బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్లలో కెప్టెన్ కేఎల్ రాహుల్ (132 పరుగులు నాటౌట్, 14 ఫోర్లు, 7 సిక్సర్లు) అద్భుతంగా రాణించాడు. దీంతో పంజాబ్ టీం బెంగళూరు ఎదుట భారీ లక్ష్యాన్ని ఉంచగలిగింది. బెంగళూరు బౌలర్లలో శివం దూబెకు 2 వికెట్లు దక్కగా, చాహల్ 1 వికెట్ తీశాడు.
అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన బెంగళూరు ఆరంభంలోనే తడబడింది. వికెట్లను ఎప్పటికప్పుడు కోల్పోతూ వచ్చింది. దీంతో ఆ జట్టు 17 ఓవర్లకే ఆలౌట్ అయింది. 109 పరుగులు మాత్రమే చేయగలిగింది. పంజాబ్ చేతిలో బెంగళూరు దారుణంగా ఓడిపోయింది. పంజాబ్ బౌలర్లలో రవి బిష్ణోయ్, ఎం అశ్విన్‌లకు చెరో 3 వికెట్లు దక్కగా, షెల్డాన్ కాట్రెల్ 2 వికెట్లు తీశాడు. షమీ, మాక్స్‌వెల్‌లు చెరొక వికెట్ తీశారు.