ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ పోటీల్లోభాగంగా, ఆదివారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్, కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్ల మధ్య టోర్నీ రెండో మ్యాచ్ జరిగింది. ఇందులో సూపర్ థ్రిల్లర్ ఓవర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు అనూహ్య విజయాన్ని సాధించింది. గెలవాల్సిన మ్యాచ్‌లో పంజాబ్ జట్టు ఓడిపోయింది. దీనికి కారణం ఫీల్డ్ అంపైర్ నిర్ణయం కారణమని తెలియడంతో పంజాబ్ జట్టు క్రికెటర్లతో పాటు.. ఆ జట్టు అభిమానులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.
ఐపీఎల్‌లో భాగంగా నిన్న ఢిల్లీ కేపిటల్స్‌తో దుబాయ్‌లో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ఓటమి పాలైంది. చివరి ఓవర్‌లో ఉత్కంఠభరితంగా మారిన ఈ మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారితీయగా ఢిల్లీ కేపిటల్స్ అనూహ్యంగా విజయ తీరాలకు చేరుకుంది. అయితే, అంపైర్ తప్పుడు నిర్ణయం కారణంగా మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారితీసిందని, అదే పంజాబ్ కొంప ముంచిందని తెలియడంతో అభిమానులు షాకయ్యారు.
దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ఆ తర్వాత 158 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన పంజాబ్ ఆరంభంలో తడబడింది. అయితే, ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (89) చివరి ఓవర్ వరకు క్రీజులో నిలబడి విజయం కోసం శాయశక్తులా ప్రయత్నించాడు.
పంజాబ్ విజయం ఖాయమని అందరూ భావించారు. అయితే, రబడ వేసిన 18వ ఓవర్ మూడో బంతిని ఆడిన మయాంక్ రెండు పరుగులు చేశాడు. అయితే, మరో ఎండ్‌లో ఉన్న క్రిస్ జోర్డాన్ బ్యాటును క్రీజులో ఉంచలేదంటూ లెగ్ అంపైర్ నితిన్ మీనన్ ఓ పరుగును తొలగించి, ఒక పరుగు మాత్రమే ఇచ్చాడు. ఇదే పంజాబ్ కొంపముంచిది.
చివరి ఓవర్‌లో పంజాబ్ విజయానికి 13 పరుగులు అవసరం కాగా, తొలి మూడు బంతుల్లో 12 పరుగులు సాధించింది. విజయానికి ఒకే ఒక్క పరుగు అవసరమైన సమయంలో చివరి రెండు బంతుల్లో రెండు వికెట్లను కోల్పోయింది. ఫలితంగా మ్యాచ్ టై అయింది.
ఇక, ఆ తర్వాత జరిగిన సూపర్ ఓవర్‌లో ఢిల్లీ విజయం సాధించింది. ఇక్కడివరకు బాగానే ఉన్నా.. అంపైర్ నిర్ణయం ఇప్పుడు వివాదాస్పదమైంది. టీవీ రీప్లేలో జోర్డాన్ క్రీజులో బ్యాట్ పెట్టినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. అంటే, అంపైర్ తప్పుడు నిర్ణయం కారణంగా పంజాబ్ జట్టు ఓ పరుగును కోల్పోయింది. నిజానికి అంపైర్ ఆ నిర్ణయం తీసుకోకుంటే పంజాబ్ విజయం సాధించి ఉండేది.
అంపైర్ తప్పుడు నిర్ణయంపై వీరేంద్ర సెహ్వాగ్, ఆకాశ్ చోప్రాలు విమర్శలు కురిపించారు. ఒక పరుగు కోత విధించిన అంపైర్‌కే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇచ్చి ఉండాల్సిందని సెహ్వాగ్ చలోక్తి విసిరారు. ఇప్పుడు కోల్పోయిన రెండు పాయింట్లతో పంజాబ్ జట్టు ప్లే ఆఫ్ అవకాశాలు కోల్పోతే పరిస్థితి ఏంటని చోప్రా ప్రశ్నించాడు.