Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

#DCvKXIP ఐపీఎల్ 2020 : క్రిస్ గేల్ ముగింట అరుదైన రికార్డు!

Advertiesment
IPL 2020
, ఆదివారం, 20 సెప్టెంబరు 2020 (17:28 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ అంచె పోటీల్లో భాగంగా ఆదివారం రాత్రి పంజాబ్ కింగ్స్ లెవెన్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య రసవత్తర పోరు జరుగనుంది. ఈ టోర్నీ ఆరంభపోటీగా చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరుగగా, ధోనీ సేన బోణీ కొట్టింది. అలాగే, శనివారం జరిగే మ్యాచ్‌లో గెలుపొంది, శుభారంభం చేయాలని ఇరు జట్లూ తహతహలాడుతున్నాయి. 
 
అయితే, ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు క్రిస్ గేల్ ముంగిట అరుదైన రికార్డు ఒకటి వుంది. ప్రస్తుతం ఈ సీజన్‌లో గేల్ కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్టు తరపున ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. 
 
ఐపీఎల్‌లో ఇప్పటివరకు 125 మ్యాచ్‌ల్లో 4,484 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో 4,500 పరుగుల మార్క్‌ను అధిగమించడానికి గేల్‌ ఇంకో 16 పరుగులు చేయాల్సి ఉంది. ఢిల్లీతో పోరులో గేల్‌ 16 రన్స్‌ చేస్తే.. డేవిడ్‌ వార్నర్‌ తర్వాత ఈ మార్క్‌ అందుకున్న రెండో విదేశీ ఆటగాడిగా నిలువనున్నాడు. ఓవరాల్‌గా మైలురాయిని అందుకున్న ఆరో బ్యాట్స్‌మన్‌గా క్రిస్‌గేల్‌కు జాబితాలో చోటుదక్కనుంది. 
 
ఐపీఎల్‌లో పరుగుల వీరుల జాబితాను పరిశీలిస్తే, విరాట్‌ కోహ్లీ 5,412 రన్స్‌ చేయగా, సురేశ్‌ రైనా 5,368, రోహిత్‌ శర్మ 4,898, డేవిడ్‌ వార్నర్‌ 4,706, శిఖర్‌ ధావన్ 4,567 చొప్పున పరుగులు చేశాడు. 
 
కాగా, గతంలో ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో క్రిస్ గేల్ 69 పరుగులు చేశాడు. 37 బంతులు ఎదుర్కొన్న గేల్.. ఆరు ఫోర్లు, ఐదు సిక్సర్ల సాయంతో 186.49 స్ట్రైక్ రేట్‌తో ఈ పరుగులు చేశాడు. 
 
ఇదిలావుంటే, ఢిల్లీ కేపిటల్స్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు కీలక బౌలర్ ఇషాంత్‌శర్మ గాయపడ్డాడు. నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా శనివారం గాయపడినట్టు మేనేజ్‌మెంట్ తెలిపింది. దీంతో ఆదివారం మ్యాచ్‌లో ఇషాంత్ ఆడకపోవచ్చని తెలుస్తోంది. 
 
మ్యాచ్ ప్రారంభమయ్యే సమయానికి ఇషాంత్ ఫిట్‌గా ఉంటేనే బరిలోకి దింపాలని, లేదంటే పక్కన పెట్టాలని మేనేజ్‌మెంట్ భావిస్తోంది. మెడికల్ టీం పరీక్షించిన అనంతరం నిర్ణయం తీసుకోనున్నట్టు ఢిల్లీ సపోర్ట్ స్టాప్ తెలిపింది. 
 
ఈ ఏడాది జనవరిలో చీలమండ గాయంతో జట్టుకు దూరమైన 32 ఏళ్ల ఇషాంత్ శర్మ తిరిగి ఫిబ్రవరిలో జట్టులో చోటు సంపాదించాడు. న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ సందర్భంగా జట్టులోకి వచ్చినప్పటికీ మళ్లీ అదే గాయంతో జట్టుకు మరోమారు దూరమయ్యాడు. 
 
2019లో ఢిల్లీ కేపిటల్స్‌ ఇషాంత్‌ను కొనుగోలు చేసింది. ఈ ఏడాది కూడా అతడిని రిటైన్ చేసుకుంది. గత సీజన్‌లో 13 మ్యాచ్‌లు ఆడిన ఇషాంత్ 7.58 ఎకానమీతో 13 వికెట్లు తీసుకున్నాడు.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'సింగం' సూర్యగా సీఎస్కే కెప్టెన్ ధోనీ!