Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

క్రికెట్ అంటే తెలియని జట్టుగా చెన్నై : పోరాటమన్నదే మరిచిపోయిన సీఎస్కే!! (video)

క్రికెట్ అంటే తెలియని జట్టుగా చెన్నై : పోరాటమన్నదే మరిచిపోయిన సీఎస్కే!! (video)
, మంగళవారం, 20 అక్టోబరు 2020 (09:22 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 సీజన్‌ మ్యాచ్‌లు కరోనా వైరస్ మహమ్మారి కారణంగా యూఏఈ వేదికగా జరుగుతున్నాయి. ఇందులోభాగంగా, సోమవారం చెన్నై సూపర్ కింగ్స్ - రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఇందులో పేలవ ప్రదర్శనతో ధోనీ సేన మరో ఓటమిని మూటగట్టుకుంది. ఫలితంగా ప్లేఆఫ్ ఆశలను వదులుకుంది. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌లలో మూడు మ్యాచ్‌లలో మాత్రమే గెలుపొంది, ఏడింటిలో ఓడిపోయింది. దీంతో ఇకపై ఆ జట్టు ఆడే మ్యాచ్‌లన్నీ నామమాత్రంగా మారనున్నాయి. 
 
నిజానికి తొలి 12 సీజన్ల వరకు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ముందు ఇతర జట్లు పోటీ పడలేకపోయేవి. అద్భుతమైన బ్యాటింగ్, బౌలింగ్ లైనప్‌తో ప్రత్యర్థులను వణికించేది. ఐపీఎల్ ట్రోఫీని మూడుసార్లు అందుకున్న చెన్నై నేడు ఆటరాని జట్టులా ఆడుతోంది. ఓ సారి రన్నరప్‌గా నిలిచింది. కానీ ఈ 13వ సీజన్‌లో సీఎస్కే ఆటగాళ్ల ఆట చూస్తుంటే... నిజంగా వీరికి క్రికెట్ ఆట రాదా అనిపిస్తోంది. ఆటగాళ్ళలో పోరాటమన్నదే మర్చిపోయినట్టు కనిపిస్తున్నారు. ఫలితంగా వరుస ఓటములను అలవాటుగా మార్చుకున్నారు. 
 
గత రాత్రి  జరిగిన మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో చచ్చీచెడి ఐదు వికెట్ల నష్టానికి 125 పరుగులు మాత్రమే చేయగలిగింది. శ్యామ్ కరణ్ (22), డుప్లెసిస్ (10), వాట్సన్ (8), రాయుడు (13), ధోనీ (28), జడేజా (35) వంటి ఆటగాళ్లు ఉన్న జట్టు ఒక్కో పరుగు కోసం శ్రమించింది. వంద పరుగుల స్కోరు సాధించేందుకు ఏకంగా 17 ఓవర్లు కావాల్సి వచ్చిందంటే చెన్నై బ్యాటింగ్ తీరు ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. సీఎస్కే బ్యాటింగ్ తీరుకుతోడు ప్రత్యర్థి రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయసాగారు. దీంతో పరుగులు రావడమే ఆ జట్టుకు గగనంగా మారింది.
webdunia
 
చెన్నై ఇన్నింగ్స్‌లో ఒకే ఒక్క సిక్సర్ నమోదు కావడం బ్యాట్స్‌మెన్ ఆటతీరుకు అద్దం పడుతోంది. ధోనీ, జడేజాలు క్రీజులో ఉండడంతో పరుగుల వర్షం కురుస్తుందని భావించినప్పటికీ చివరి ఓవర్లో కూడా సింగిల్స్‌కే పరిమితమయ్యారు. జడేజా ఆమాత్రం పరుగులైనా చేశాడు కాబట్టి చెన్నై ఈ మాత్రం స్కోరునైనా ప్రత్యర్థి ముందు ఉంచగలిగింది. ఈ టోర్నీలో తొలి బ్యాటింగ్‌లో నమోదైన అత్యల్ప స్కోరు ఇదే కావడం గమనార్హం.
 
ఇక 126 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ జట్టు... ఆరంభంలో తడబడింది. లక్ష్యం చిన్నదే అయినా ఛేదనలో పట్టు తప్పినట్టు కనిపించింది. బెన్‌స్టోక్స్ 19 పరుగులకే అవుట్ కాగా, గత మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చి ధనాధన్ ఇన్నింగ్స్ ఆడిన రాబిన్ ఉతప్ప ఈసారి 4 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. సంజు శాంసన్ మరోమారు (0) బ్యాటెత్తేశాడు. కెప్టెన్ స్మిత్ 26 పరుగులు చేయగా, చివర్లో జోస్ బట్లర్ 70 (48 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు) పరుగులు చేసి మరో 15 బంతులు మిగిలి ఉండగానే జట్టుకు విజయాన్ని అందించాడు.
 
ఈ విజయంతో రాజస్థాన్ 4 విజయాలు, 8 పాయింట్లతో ఐదో స్థానానికి ఎగబాకింది. ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే రాజస్థాన్ ఇకపై జరిగే నాలుగు మ్యాచుల్లోనూ విజయం సాధించాల్సి ఉంటుంది. అద్భుత బ్యాటింగుతో జట్టుకు విజయాన్ని అందించిన బట్లర్‌కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు దక్కింది. సీఎస్కే జట్టు మాత్ర ప్లేఆఫ్ ఆశలు వదులుకుని మిగిలిన మ్యాచ్‌లను ఆడనుంది. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐపీఎల్ 2020 : విరాటుడి రికార్డును బ్రేక్ చేసిన ఆసీస్ ప్లేయర్!!