ఐపీఎల్ టోర్నీలో భాగంగా, ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు చేజేతులా ఓడింది. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో హోరాహోరీగా పోరాడినప్పటికీ... సూపర్ ఓవర్‌లో మాత్రం దారుణంగా ఆడి చేజేతులా ఓడింది. సూపర్ ఓవ లో కేవలం 2 పరుగులు చేసి తన ఓటమికి తానే కారణమైంది.
సూపర్ ఓవర్‌లో సన్ రైజర్స్ తరపున వార్నర్, బెయిర్ స్టో బరిలో దిగారు. అయితే కోల్‌కతా బౌలర్ లాకీ ఫెర్గుసన్ ఎలాంటి అవకాశం ఇవ్వకుండా వార్నర్‌ను బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన సమద్ కూడా బౌల్డ్ కావడంతో 2 పరుగులే వచ్చాయి.
ఇక కోల్‌కతా తరపున దినేశ్ కార్తీక్, ఇయాన్ మోర్గాన్ సూపర్ ఓవర్ ఆడారు. సన్ రైజర్స్ తరపున రషీద్ ఖాన్ బౌలింగ్ చేశాడు. అయితే ఎంత ప్రయత్నించినా కోల్‌కతా విజయాన్ని అడ్డుకోలేకపోయాడు.
ఇందులో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 163 పరుగులు చేసింది. ఐదు వికెట్లను కోల్పోయింది. నిజానికి ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ బౌలర్లు 16 ఓవర్ల వరకు మెరుగైన ప్రదర్శన కనబర్చారు. ఈ కారణంగా 4 వికెట్లకు 111 పరుగులు మాత్రమే చేసింది.
ఆ తర్వాత పట్టు సడలించారు. ఫలితంగా కేకేఆర్ ఆటగాళ్లు చివరి నాలుగు ఓవర్లలో ఏకంగా 52 పరుగులు పిండుకున్నరు. దీంతో 20 ఓవర్లలో 163 పరుగులు చేసింది. కోల్‌కతా బ్యాట్స్ మెన్ విలువైన పరుగులు జోడించి, జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించారు.
మ్యాచ్ ఆఖర్లులో ఆ జట్టు మాజీ కెప్టెన్ దినేష్ కార్తీక్ 14 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులతో చకచకా 29 పరుగులు చేశాడు. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ బాధ్యతగా ఆడి 34 రన్స్ నమోదు చేశాడు.
అంతకుముందు ఓపెనర్ శుభ్‌మాన్ గిల్ 36, మరో ఓపెనర్ రాహుల్ త్రిపాటి 23 పరుగులు చేయగా, నితీశ్ రానా 29 పరుగులు జోడించాడు. ఆండ్రీ రస్సెల్ 9 పరుగులు చేసి నిరాశపరిచాడు.
కేకేఆర్ ఆటగాళ్లలో ఓపెనర్లు గిల్ 36, త్రిపాఠి 23, రానా 29, రస్సెల్ 9, మోర్గాన్ 34, కార్తీక్ 29 చొప్పున పరుగులు చేశారు. సన్ రైజర్స్ బౌలర్లలో నటరాజన్ 2 వికెట్లు తీయగా, బాసిల్ థంపి, విజయ్ శంకర్, రషీద్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు.
ఆ తర్వాత 164 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టు... 20 ఓవర్లలో 6 వికెట్లకు 163 పరుగులే చేసింది. దాంతో మ్యాచ్ టై కావడంతో సూపర్ ఓవర్ నిర్వహించారు.
చివరి ఓవర్ లో 18 పరుగులు కావాల్సి ఉండగా, వార్నర్ 3 ఫోర్లు బాది సన్ రైజర్స్‌ను రేసులోకి తీసుకువచ్చినా, చివరి బంతికి తడబడడంతో ఒక పరుగే వచ్చింది. దాంతో మ్యాచ్ టై అయింది.
కెప్టెన్ డేవిడ్ వార్నర్ 33 బంతుల్లో 5 ఫోర్లతో 47 (నాటౌట్), జానీ బెయిర్‌స్టో 28 బంతుల్లో 7ఫోర్లతో 34, విలియమ్సన్ 29, అబ్దుల్ సమద్ 23 చొప్పున పరుగులు చేశారు.
కాగా. ఈ మ్యాచ్ ద్వారా సన్ రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ అరుదైన రికార్డు సాధించాడు. ఐపీఎల్‌లో 5000 వేల పరుగులు సాధించిన తొలి విదేశీ ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. వార్నర్ 135 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనత అందుకున్నాడు.