పాకిస్థాన్ గడ్డపై ఉన్న ఉగ్రవాదుల ఏరివేత కోసం సరఫరా చేసిన ఎఫ్-16 యుద్ధ విమానాలతో భారత్‌పై దాడికి దిగడాన్ని అమెరికా జీర్ణించుకోలేకపోతోంది. దీంతో పాకిస్థాన్‌పై కన్నెర్రజేస్తోంది. వివరణ ఇవ్వాలని కోరింది. దీంతో పాక్ ఏం చేయాలో తెలియక మల్లగుల్లాలు పడుతోంది. తాము భారత్‌పై దాడికి ఉపయోగించిన విమానాలు ఎఫ్-16 విమానాలు కాదనీ, చైనా తయారు చేసిన జేఎఫ్-17 విమానాలని బుకాయించింది.
పాక్ ఆక్రమిత కాశ్మీరులో భారతీయ వైమానిక దళానికి చెందిన మిగ్-21 దాడిలో కూలినది ఎఫ్-16 అవునో కాదో తేల్చి చెప్పండంటూ అమెరికా హెచ్చరించింది. దీంతో తత్తరపాటుకుగురైన పాకిస్థాన్ బుకాయింపునకు దిగింది.
చైనాతో కలసి తాము తయారు చేసుకున్న జేఎఫ్-17 యుద్ధ విమానంతోనే ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్ నడుపుతున్న మిగ్-21ను పాక్ ఆక్రమిత కాశ్మీరులో కూల్చివేశామంటూ పాకిస్తాన్ ప్రభుత్వం అమెరికాకు వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తోంది.
ఎఫ్-16 విమానాలను దేశాలపై దాడులకు వీటిని ఉపయోగించరాదన్న షరతును ఉల్లంఘించడంపై పాక్ వివరణ కోరినట్లు ఇస్లామాబాద్‌లోని అమెరికా ఎంబసీ ప్రతినిధి ఒకరు తెలియచేశారు. 'రెండు దేశాల మధ్య ఒప్పందంలో ఏముందో నాకు తెలియదు. కానీ ఆ కూలింది మాత్రం నిస్సందేహంగా ఎఫ్-16యుద్ధ విమానమే! దానికి అమ్రామ్ క్షిపణిని కూడా అమర్చారు. ఎఫ్-16లకు మాత్రమే వాటిని అటాచ్ చేస్తారు' అని భారత వైమానిక దళ చీఫ్ ధనోవా స్పష్టం చేశారు.