అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. అగ్రరాజ్యానికి 47వ అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో గెలిచిన ట్రంప్.. సగర్వంగా రెండోసారి శ్వేతసౌధంలోకి అడుగుపెట్టబోతున్నారు. అమెరికాలో గెలిచిన అభ్యర్థి ప్రమాణ స్వీకారం చేయడానికి సుదీర్ఘ సమయం పడుతుంది. ఇంచుమించు 11 వారాల సమయం పడుతుంది. ఈ క్రమంలో డొనాల్డ్ ట్రంప్ జనవరిలో ప్రమాణ స్వీకారం చేస్తారు.
2025 జనవరి 3న కొత్తగా ఎన్నికైన కంగ్రెషనల్ రిప్రజెంటేటివ్స్, సెనేటర్స్ ప్రమాణ స్వీకారం జరుగుతుంది. 2025 జనవరి 6న ఎలక్టొరల్ కాలేజ్ ఓట్లను కాంగ్రెస్ లెక్కిస్తుంది. దీని కోసం కాంగ్రెస్ ప్రత్యేక సంయుక్త సమావేశం జరుగుతుంది. 270 లేదా అంతకన్నా ఎక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థిని దేశాధ్యక్షునిగా ప్రకటిస్తారు. దేశ ఉపాధ్యక్షునికి కూడా ఇదే నిబంధన వర్తిస్తుంది. 2025 జనవరి 20న మధ్యాహ్నం దేశాధ్యక్షుడు ప్రమాణ స్వీకారం చేస్తారు.
అమెరికా రాజ్యాంగం ప్రకారం ప్రతినిధుల సభ, సెనెట్ సంయుక్త సమావేశానికి ఉపాధ్యక్ష పదవిలో ఉన్నవారు అధ్యక్షత వహించాల్సి ఉంటుంది. అంటే ఈసారి ఆ బాధ్యత కమలా హారిస్ నిర్వర్తిస్తారు. కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అని కమలా హారిస్ స్వయంగా ప్రకటిస్తారు.