శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. అక్కడి ప్రజలు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో కర్ఫ్యూ కాస్త సడలించగానే.... శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్సే నివాసంలోకి నిరసనకారులు శనివారం ఉదయం దాడి చేయడంతో పారిపోయినట్లు సమాచారం. అధ్యక్షుడు గోటబయ రాజపక్సే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న నిరసనకారులు ఆయన నివాసాన్ని చుట్టుముట్టారు.
ఆ తర్వాత లంక అగ్రనేత తప్పించుకున్నారని రక్షణ వర్గాలు పేర్కొన్నట్లు ఓ మీడియా సంస్థ తెలిపింది. శ్రీలంక జెండాలను మోసుకెళ్లిన వేలాది మంది నిరసనకారులు తీవ్రమైన ఇంధన కొరత కారణంగా రోడ్లపై వచ్చారు. మరికొందరు సైకిళ్లపై ర్యాలీగా వచ్చారు. అనేక మంది రాజధాని కొలంబోలోని నిరసన చేస్తూ రోడ్లపై ఆందోళన చేసారు.
శ్రీలంక పోలీసులు రాత్రిపూట కర్ఫ్యూను ఎత్తివేసిన ఒక రోజు తర్వాత ఇది జరిగింది. నిరసనకారులు రాజపక్సేనే ఆర్థిక ఇబ్బందులకు కారణమని ఆరోపించారు. శ్రీలంక ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని ఆ దేశ ప్రధాని రణిల్ విక్రమసింఘే గత నెలలో వెల్లడించిన సంగతి తెలిసిందే.