అవినీతి సొమ్ముతో ఇల్లు కట్టారా అని ప్రశ్నించిన ఓ జర్నలిస్టుకు తగినశాస్తి జరిగింది. నన్ను అవినీతిపరుడు అంటావా అంటూ ఆగ్రహించిన ఆ ప్రభుత్వ అధికారి ఆ జర్నలిస్టును పట్టుకుని ఎత్తి నేలపై పడేశాడు. ఈ హఠాత్పరిణామంతో ఆ జర్నలిస్టు బిక్కమొహం వేశాడు. ఈ ఘటన రష్యాలో జరిగింది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రష్యాలోని సైబీరియా జిల్లా ముఖ్య అధికారి సెర్జీ జైత్సేవ్ (52)తో ముఖాముఖి ఇంటర్వ్యూ కోసం ఇవాన్ లిటోమిన్ అనే జర్నలిస్టు ప్రభుత్వ కార్యాలయానికి వచ్చాడు. యువకుడైన ఇటోమిన్ అడిగిన ప్రశ్నలు జైత్సేవ్‌ను పదేపదే ఇరకాటంలోకి నెట్టాయి. ముఖ్యంగా, 2015లో రష్యాలో కార్చిచ్చు చెలరేగగా, నష్టపరిహారం సొమ్మును అధికారులు దిగమింగినట్టు తీవ్ర ఆరోపణలు వచ్చాయి.
ఇదే అంశంపై ఆ అధికారిని జర్నలిస్టు పదేపదే గుచ్చిగుచ్చి ప్రశ్నలు సంధించారు. దీంతో నిగ్రహం కోల్పోయాడు. అయినప్పటికీ ఆ విలేకరి అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ వచ్చాడు. చివరకు అవినీతి సొమ్ముతో మీరు రాజసౌధంలాంటి భవనం నిర్మించారా? అని లిటోమిన్ అడగడంతో జైత్సేవ్‌లో కోపం కట్టలు తెంచుకుంది.
ఒక్కసారిగా ముందుకు ఉరికి ఆ యువ జర్నలిస్టును దొరకబుచ్చుకుని ఎత్తి నేలపై కుదేశాడు. ఊహించని హఠాత్పరిణామానికి ఆ పాత్రికేయుడు బిక్కచచ్చిపోయాడు. అక్కడున్న వారు వెంటనే కలుగజేసుకుని లిటోమిన్‌ను బయటికి తీసుకువచ్చారు. ఈ ఘటన రష్యాలో అధికారవర్గాల్లో నెలకొన్న అవినీతికి నిదర్శనం అని అక్కడి మీడియా ఎలుగెత్తి ఘోషిస్తోంది.