అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఎన్నికల్లో పోటీ చేసినప్పటి నుంచి వివాదాలు చెలరేగుతూనే వున్నాయి. ఆయన పాలసీలతో ఇప్పటికే ఎన్నారైలకు తలనొప్పి తప్పట్లేదు. అలాగే వలసదారులు కూడా ట్రంప్ పథకాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ నేపథ్యంలో ట్రంప్‌కు పాప్ గాయని రిహాన్నా షాకిచ్చింది. అమెరికా మధ్యంతర ఎన్నికల ప్రచారం సందర్భంగా ర్యాలీలో తన పాటను వాడుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ లీగల్ నోటీసులు పంపింది. టెన్నెస్సోలోని చట్టనూగలో నిర్వహించిన రిపబ్లికన్ పార్టీ ర్యాలీలో రిహాన్నా పాడిన ''డోన్ట్ స్టాప్ ది మ్యూజిక్'' గీతాన్ని నిర్వాహకులు ప్రసారం చేశారు. దీంతో ట్విట్టర్ సాక్షిగా ట్రంప్, ఆయన అనుచరులపై రిహాన్నా ఫైర్ అయ్యింది.
ఇలాంటి ద్వేషపూరితమైన ర్యాలీల్లో తాను కానీ, తన అభిమానులు కానీ పాల్గొనరని క్లారిటీ ఇచ్చింది. అయినా ''ట్రంప్ మీ ర్యాలీల్లో నా పాటలేంటి?'' అంటూ నిలదీసింది. తన అనుమతి లేకుండా తన ఆల్బమ్స్‌ను ప్రసారం చేసినందుకు సదరు నిర్వాహకులకు రిహాన్నా లీగల్ నోటీసులు జారీ చేసింది. ఈ విషయాన్ని తన దృష్టికి తీసుకొచ్చిన ఫిలిప్ రక్కర్ అనే నెటిజన్‌కు రిహాన్నా ధన్యవాదాలు తెలిపింది.