ప్రపంచం అంతా కరోనా మహమ్మారితో పోరాడుతూ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటుంటే.. మరోవైపు ఉత్తర కొరియా తన ఆయుధ సంపత్తిని విస్తరించుకోవడంలో నిమగ్నమై ఉన్నది. జలాంతర్గామి నుంచి అణ్వస్త్ర బాలిస్టిక్ క్షిపణిని త్వరలోనే పరీక్షించడానికి ఉత్తర కొరియా సిద్ధమైనట్లు తెలుస్తోంది.
మూడు వేల టన్నుల బరువుండే ఒక జలాంతర్గామిలో ఒకేసారి మూడు క్షిపణులను మోహరించే అవకాశం ఉంది. దాని నుంచి ప్రయోగించే పుక్‌గుక్సన్-3 అనే క్షిపణికి 1,900 కిలోమీటర్ల స్ట్రయిక్ రేంజ్ ఉంటుందని నిపుణుల అంచనా. అమెరికాపై ఉత్తరకొరియా దాడి చేయాలంటే ఇది 12 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. అయితే పుక్‌గుక్సన్-3 మొత్తం సామర్థ్యం ఏడు వేల కిలోమీటర్లు మాత్రమే అని తెలుస్తోంది.
ఈ పరీక్ష ద్వారా ఉత్తరకొరియా పసిఫిక్ మహాసముద్రం నుంచి గువామ్, హవాయి, అమెరికాలను లక్ష్యంగా చేసుకోవచ్చని తెలుస్తోంది. ఉత్తరకొరియా పాల్పడుతోన్న ఈ చర్యలు ఈశాన్య ఆసియాతో పాటు అమెరికాకు ముప్పుగా పరిణమిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఉత్తర కొరియా వ్యవస్థాపకుడు కిమ్ ఇల్-సుంగ్ పుట్టినరోజున ఈ సమాచారం బయటపడింది.
ఆ రోజు ఉత్తర కొరియాలో ప్రజలు సన్ ఫెస్టివల్ జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం, సన్ ఫెస్టివల్ సందర్భంగా, సైన్యం సిద్ధంగా ఉండాలని ఆదేశాలు ఇస్తుంటారు. అయితే అణు క్షిపణులకు సంబంధించి ఇటువంటి ఉత్తర్వులు చాలా షాకింగ్ అని స్థానిక మీడియా చెబుతోంది.
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ 240 అణ్వాయుధాలు మరియు బాలిస్టిక్ క్షిపణుల ప్రాణాంతక ఆయుధాగారాన్ని నిర్మిస్తున్నాడని, ఇది పశ్చిమ దేశాలకు విస్తృతమైన నష్టాన్ని కలిగిస్తుందని అక్కడి మీడియా పేర్కొంది. మొత్తానికి కిమ్ ఇచ్చిన ఉత్తర్వులు అమెరికాతో సహా మొత్తం ప్రపంచం యొక్క ఆందోళనను పెంచుతున్నాయి.