Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చైనా పనిపట్టే క్షిపణి దక్షిణ భారత్‌లో నిర్మాణం.. అది తయారైతే మాత్రం చైనాకు కారుడే..

స్వాతంత్ర్యం వచ్చిన ఏడు దశాబ్దాల తర్వాత చైనాకు వణుకు పుట్టించే బ్రహ్మాస్త్రాన్ని భారత్ నిర్మిస్తోంది. యుద్దోన్మాదానికి భారత్ పూనుకోవడం లేదు కానీ తనపై చేయి వేస్తే చాలు యావత్ చైనాలో ఏ టార్గెట్ నయినా సరే ధ్వంసం చేసిపడేసే అత్యాధునిక అణుబాంబును భారత్ రూపొ

చైనా పనిపట్టే క్షిపణి దక్షిణ భారత్‌లో నిర్మాణం.. అది తయారైతే మాత్రం చైనాకు కారుడే..
హైదరాబాద్ , శుక్రవారం, 14 జులై 2017 (01:58 IST)
స్వాతంత్ర్యం వచ్చిన ఏడు దశాబ్దాల తర్వాత చైనాకు వణుకు పుట్టించే బ్రహ్మాస్త్రాన్ని భారత్ నిర్మిస్తోంది. యుద్దోన్మాదానికి భారత్ పూనుకోవడం లేదు కానీ తనపై చేయి వేస్తే చాలు యావత్ చైనాలో ఏ టార్గెట్ నయినా సరే ధ్వంసం చేసిపడేసే అత్యాధునిక అణుబాంబును భారత్ రూపొందిస్తోంది. దక్షిణ భారత దేశంలోని తన స్థావరం నుంచి భారత్ ప్రయోగిస్తే చైనాను భస్మీపటలం చేసేంత స్థాయిని ఆ క్షిపణి కలిగి ఉంటుందని అమెరికా సంచలన ప్రకటన చేసింది. ఇదే కాకుండా తనపై చైనా సమీప భవిష్యత్తులో కూడా కన్నెత్తి చూడలేని విధంగా దాదాపు 200 వార్ హెడ్లకు సరిపడా ప్లుటోనియంని భారత్ సిద్ధం చేసి ఉంచిందని అమరికన్ జర్నల్ చెబుతున్న కథనం ప్రపంచ మిలిటరీ వ్యూహ నిపుణులను నివ్వెర పరుస్తోంది. 
 
చీటికిమాటికి సరిహద్దుల వద్ద వివాదాలు సృష్టిస్తూ మన భూభాగాన్ని ఆక్రమించుకునేందుకు యత్నిస్తున్న చైనా ఆటకట్టించే దిశగా భారత్‌ ముందుకు సాగుతోంది. ఇందులోభాగంగా అణ్వాయుధాలను ఆధునీకరిస్తోంది. వాస్తవానికి ఇప్పటిదాకా పాకిస్థాన్‌నే తన ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్న  భారత్‌ ఇప్పుడు కమ్యూనిస్టు దిగ్గజం అంతుచూడాలని భావిస్తున్నట్టు అమెరికాకు చెందిన అణురంగ నిపుణులు పేర్కొన్నారు. దక్షిణ భారతదేశంలోని తన స్థావరం నుంచి ప్రయోగిస్తే చైనా భస్మీపటలం అయ్యేస్థాయి కలిగిన క్షిపణిని భారత్‌ తయారుచేస్తోందని జూలై–ఆగస్టు మధ్యకాలంలో ప్రచురించిన ఓ వ్యాసంలో అమెరికాకు చెందిన డిజిటల్‌ జర్నల్‌ పేర్కొంది.
 
150 నుంచి దాదాపు 200 వార్‌హెడ్లకు సరిపడా ప్లుటోనియంను భారత్‌ సిద్ధం చేసిందని, అయితే 120 నుంచి 130 వార్‌హెడ్లను మాత్రమే తయారుచేస్తుందని సదరు వ్యాసం పేర్కొంది. సిక్కిం సరిహద్దు వివాదంతో భారత్‌–చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. డోక్లాం ప్రాంతం నుంచి భారత బలగాలు వెనక్కి వెళ్లాలంటూ చైనా హెచ్చరిస్తున్నా భారత్‌ వెనక్కి తగ్గడం లేదు. దీంతో ఇరు దేశాల మధ్య దాదాపు యుద్ధ వాతావరణం నెలకొంది. 
 
ఈ నేపథ్యంలో భారత అణు శక్తిపై ప్రముఖ అమెరికన్‌ అణ్వాయుధ నిపుణులు రాసిన కథనం ఆసక్తికరంగా మారింది. నిన్న మొన్నటి వరకు పాకిస్థాన్‌లోని ఏ ప్రాంతాన్నైనా టార్గెట్‌ చేసి దాని అంతుతేల్చగల సామర్థ్యం సముపార్జించుకునేందుకు దృష్టిపెట్టిన భారత్‌ ఇప్పుడు ఆ లక్ష్యాన్ని చైనా వరకు పొడిగించిందని, ప్రస్తుతం చైనాలోని ఏ ప్రాంతంపైనైనా దాడి చేయగల సామర్థ్యంకోసం తన వద్ద ఉన్న అణ్వాయుధాలను మరింత ఆధునీకరిస్తోందంటూ అమెరికాలోని అణుశాస్త్ర నిపుణులు పేర్కొన్నారు. 
 
అమెరికాకు చెందిన హన్స్‌ ఎం క్రిస్టెన్సన్, రాబర్ట్‌ ఎస్‌ నోరిస్‌ అనే ఇద్దరు అణ్వాయుధ నిపుణులు.. ‘ఇండియన్‌ న్యూక్లియర్‌ ఫోర్స్‌ 2017’ పేరుతో కథనం రాశారు. ఇందులో భారత అణు శక్తిని గురించి ప్రస్తావించారు. భారత్‌ తన అణ్వాయుధ సంపత్తిని ఆధునీకరిస్తోందని.. చైనా మొత్తాన్ని టార్గెట్‌ చేసేంత క్షిపణులను తయారుచేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తోందని పేర్కొన్నారు. ‘ప్రస్తుతం భారత్‌ వద్ద ఏడు అణు సామర్థ్య వ్యవస్థలు ఉన్నాయి. అందులో రెండు ఎయిర్‌క్రాఫ్ట్‌లు, నాలుగు భూ ఉపరితల ఖండాంతర క్షిపణులు, ఒకటి సముద్ర ఉపరితల ఖండాంతర క్షిపణి. అయితే ప్రస్తుతం మరో నాలుగు వ్యవస్థలను అభివృద్ధి చేస్తోంది. రానున్న దశాబ్ద కాలంలో వీటిని సిద్ధం చేయనుంది. ఇక అగ్ని–1ను ఆధునీకరించి అగ్ని–2ని తయారుచేసింది.
 
రెండు వేల కి.మీ  ప్రయాణించగల సామర్థ్యం దీనికి ఉంది. దీంతో చైనాలోని పశ్చిమ, దక్షిణ, మధ్య భూభాగాలను లక్ష్యంగా చేసుకోవచ్చు. ఇక అగ్ని–4ను భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాల నుంచి ప్రయోగిస్తే.. చైనా మొత్తాన్ని టార్గెట్‌ చేయవచ్చు. లాంగ్‌ రేంజ్‌ అగ్ని–5ని కూడా భారత్‌ అభివృద్ధి చేస్తోంది. ఐదు వేల కిలోమీటర్లకు పైగా ప్రయాణించగల సామర్థ్యం ఉన్న ఈ ఖండాంతర క్షిపణిని దక్షిణాది నుంచి ప్రయోగించినా. చైనా మొత్తాన్ని లక్ష్యంగా చేసుకోవచ్చు’ అని క్రిస్టెన్సన్, నోరీస్‌ తమ వ్యాసంలో పేర్కొన్నారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రంగస్వామి నాయుడుకి చంద్రబాబు సంతాపం(వీడియో)