ఇండొనేషియలో కుప్పకూలిన స్రివిజయ ఎయిర్ లైన్స్ చెందిన బోయింగ్ విమాన శకలాల్ని అధికారులు గుర్తించారు. బోయింగ్ విమానం జావా సముద్రంలో కుప్పకూలిపోయినట్టు నిర్ధారించారు. ఆ విమాన శకలాల్ని థౌజండ్ ఐలాండ్స్ వద్ద గుర్తించారు.
ఈ ప్రమాదం కారణంగా విమానంలో ప్రయాణించిన 62 మంది ప్రయాణికులు జలసమాధి అయ్యారు. బాధితుల కోసం జాతీయ రవాణా భద్రత కమిటీతో పాటు నేషనల్ సెర్చ్ అండ్ రెస్క్యూ ఏజన్సీలు రంగంలోకి దిగాయని ఆ దేశ రవాణా మంత్రిత్వ శాఖ ప్రతినిధి అదిత ఐరావతి తెలిపారు.
కాగా, శనివారం 62 మంది ప్రయాణికులతో రాజధాని జకార్తాలోని సుకర్ణో-హట్టా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఈ బోయింగ్ 737-500 విమానం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)తో సంబంధాలు కోల్పోయింది. స్రివిజయ ఎయిర్ లైన్స్‌కు చెందిన ఈ విమానం పాంటియానక్ వెళ్లాల్సి ఉంది. ఈ విమానంలో 56 ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు.
ఫ్లైట్ రాడార్ 24 అనే సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.... టేకాఫ్ అనంతరం 11 వేల అడుగుల ఎత్తుకు చేరిన ఈ బోయింగ్ విమానం ఒక్కసారిగా 250 అడుగుల ఎత్తుకు జారిపోగా, ఆ తర్వాత ఏటీసీతో సంబంధాలు తెగిపోయి జావా సముద్రంలో కూలిపోయింది.