Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రోడ్డుపైన చిరుతిండ్లు పేపర్‌లో తింటున్నారా... ఇది చదివితే షాకే...

Advertiesment
eating
, సోమవారం, 22 ఏప్రియల్ 2019 (19:51 IST)
మీరు సరదాగా సాయంత్రం బయటకు వెళ్ళాలనుకుంటున్నారా.. రోడ్డు పక్కన వేడివేడిగా వేస్తున్న బోండాలు, బజ్జీలు చూసి నోరూరుతోందా.. వెంటనే వాటిని లాగించేయానుకుంటున్నారా.. అయితే ఒక్క క్షణం ఆగండి.. ఇది చదివి తినాలో వద్దో మీరే డిసైడ్ చేసుకోండి..
 
బిజీ బిజీ లైఫ్‌లో రోజంతా పనిచేశాక సాయంత్రం అట్లా సరదాగా బయటకు ఎవరికైనా వెళ్ళాలనిపిస్తుంది. ముఖ్యంగా ఇంట్లో పిల్లలుంటే వారు షికారుకు తీసుకెళ్ళమని చేసే మారాం అంతా ఇంతా కాదు. అలా ఆరుబయటకు వెళ్ళగానే ఇలా రోడ్డుపక్కన తోపుడు బండ్లపై కనిపించే బోండాలు, బజ్జీలు, పునుగులు తెగ నోరూరించేస్తుంటాయి. ఇక పిల్లలైతే వాటిని కొనిచ్చేంత వరకు మారాం ఆపరు. 
 
అలా బండి వాళ్ళు వేడివేడిగా పేపర్లో కట్టి ఇవ్వగానే క్షణాల్లో వాటిని లొట్టలేసుకుని ఆరగించేస్తాం కదూ. ఇందులో వింతేముంది. ఎవరైనా చేసేది ఇదేకదా అనుకుంటున్నారా. అయితే ఇక్కడే ఉంది అసలు విషయం. ఇలా రోజూ మీరు కొద్దికొద్దిగా విషం తినడమే కాకుండా మీ ఇంట్లో వాళ్లకు తినిపిస్తున్నారన్న విషయం తెలుసా. ఈ స్లో పాయిజన్ భవిష్యత్తులో మీ ఆరోగ్యానికి ఎంతటి హానికరమో ఆలోచించారా. 
 
సాధారణంగా న్యూస్ పేపర్లలోను, ఇతర మ్యాగ్ జైన్ పేపర్లలోను ఇలాంటి చిరు తిండ్లు ఇస్తుంటారు షాపుల వాళ్ళు. తినేశాక పేపర్‌ను మడిచి పారేస్తాం. కానీ మీరు తినే భజ్జీలు, బోండాలతో పాటు ప్రింటింగ్ పేపర్లో ఉన్న ప్రమాదకరమైన రసాయనాలు మీ కడుపులోకి వెళ్ళిపోతాయి. ముఖ్యంగా నూనె పదార్థాలు ఉన్న తినుబండారాలు మరింతగా పేపర్ లోని ఇంకును కరిగిస్తాయి. అవి కడుపులోకి వెళ్ళిన బోండాలు, భజ్జీలు జీర్ణమైపోతాయేమోగానీ, ప్రమాదకరమైన ప్రింటింగ్ రసాయనం మాత్రం జీర్ణం కాదు. 
 
జీర్ణం కాకపోగా అది మెల్లమెల్లగా మీ శరీరాన్ని తినేస్తుంటుంది. కడుపులోని పేగులను క్రమక్రమంగా క్షీణింపజేయడమే కాకుండా క్యాన్సర్‌కు కారకమవుతుంది. ఈ మధ్యకాలంలో ప్రింటింగ్‌లో గతంలో లాగా సాధారణ ఇంక్ వాడకుండా రసాయనాలతో కలగలసిన మిశ్రమాన్ని వాడుతున్నారు. ఇది మరింతగా హానికరమని వైద్యులు చెబుతున్నారు. ఈ మధ్యకాలంలో ఇటువంటి కేసులు కూడా వస్తున్నట్లుగా వైద్యులు చెబుతున్నారు. 
 
అయితే ఇంతగా ఆరోగ్యాన్ని పాడుచేసేలాగా జరుగుతున్నా ఆరోగ్య శాఖ అధికారులు మాత్రం దృష్టి సారించడం లేదు. కేవలం ప్లాస్టిక్ కవర్లను నిషేధించి కాలుష్య నివారణ దిశగా మాత్రమే చర్యలు చేపట్టి చేతులు దులుపుకుంటున్నారు తప్ప ఈ విషయంపైన కూడా ఆలోచించాల్సి ఉంది. 
 
ముఖ్యంగా ఆహార నాణ్యత విభాగం అడపాదడపా రోడ్లప్రక్కన షాపులు, హోటళ్ళపై తనిఖీలు నిర్వహించి ఆహార నాణ్యతను మాత్రం పరిశీలించి వదిలేస్తున్నారు. అంతే తప్ప ఆ ఆహారాన్ని ప్రజలకు ఏ విధంగా అందిస్తున్నారు అనే దానిమీద మాత్రం ఇప్పటి వరకు దృష్టిసారించకపోవడం జరుగుతూ వస్తోంది. ఇప్పటికైనా దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టి ప్రింటింగ్ పేపర్లలో తినుబండారాలను నిషేధించే విధంగా చర్యలు తీసుకొని ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని వైద్యులు చెబుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చల్లని నీరు వద్దు... వేడి నీరే ముద్దు.. ఎందుకని?