సాధారణంగా జలుబు ఏ కాలంలో అయినా చేస్తుంది. ముక్కు మూసుకొని పోయి.. నిద్ర లేకుండా చేస్తుంది. పోగొట్టుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తేచాలు...
మన పూర్వీకుల నుంచి ఉన్న చిట్కా.. వేడినీటితో ఆవిరి పట్టేయొచ్చు. కొందరు బామ్ వంటివాటిని వేసి పడుతుంటారు. అది కొన్నిసార్లు ప్రమాదంగా మారొచ్చు. కేవలం నీళ్లు లేదా పసుపు కలిపి పడితే చాలు. యూకలిస్టస్ ఆయిల్ రెండు, మూడు చుక్కలను ఏదైనా వస్త్రం మీద వేసుకొని లేదా వేడి నీటిలో వేసుకొని ఆవిరి పీల్చినా ఉపశమనం ఉంటుంది.
జలుబు పెద్ద రోగంతో సమానమని ఊరికే అనరు. ఏమీ తినాలనిపించదు.. తాగాలనిపించదు. కానీ వీలైనంత ఎక్కువగా ద్రవపదార్ధాలు తీసుకోవాలి. అల్లం, తేనె వేసుకొని టీ లేదా వేడి నీటిలో యాపిల్ సిడార్ వెనిగర్ కలిపి తాగినా మంచిదే! ఇవి కూడా ముక్కు మూసుకుపోకుండా సాయపడతాయి.
ముక్కుదిబ్బడనే కాదు గొంతులో గరగర, దగ్గు, సైనస్ సమస్యల నుంచీ ఉపశమనం కలిగిస్తుంది. పావు గ్లాసు గోరువెచ్చని నీటిలో కొంచెం ఉప్పు కలిపి గొంతు లోపలికి వెళ్లేలా పుక్కిలించి ఊయండి. రోజులో 3-4 సార్లు చేస్తే సూక్ష్మజీవులను చంపడమే కాదు.. తక్షణ ఉపశమనం లభిస్తుంది. ఎలాంటి జలుబు లక్షణమైనా దీన్ని ప్రయత్నించొచ్చు.