పగలైనా, రాత్రయినా గబ్బిలాలు చూడలేవు. వాటికి కళ్లున్నా అవి నామమాత్రమే. కాంతిని గ్రహించే శక్తి వాటికి లేదు. అవి కేవలం నోరు, చెవుల సమన్వయంతో మాత్రమే పరిసరాలను అంచనా వేయగలవు. అంటే ఒక విధంగా అవి చెవులతో చూస్తాయని చెప్పవచ్చు.
అలాగని గబ్బిలాలు తమ కళ్ల ద్వారా చూడలేవని అనుకోకూడదు. వాటి కళ్లు వెలుగు, చీకటుల తేడాను గుర్తించగలవు. తద్వారా వస్తువుల ఆకృతులను తెలుసుకోగలవు. అంతే కాకుండా గబ్బిలాలు తాము అంతకు ముందు సంచరించిన ప్రాంతాలను సులువుగా గుర్తుపెట్టుకోగలవు.
గబ్బిలాలు నోటితో అతిధ్వనులను (ultrasonic sounds) చేస్తాయి. మనకి వినబడని ఆ ధ్వని తరంగాలు గాలిలో ప్రయాణిస్తూ దారిలో ఎదురయ్యే అడ్డంకులను ఢీకొని వెనుదిరుగుతాయి. అలా వెనక్కి వచ్చే ప్రతిధ్వని తరంగాలను వినడం ద్వారా గబ్బిలాలు తమ పరిసరాల్లో ఎలాంటి అడ్డంకి ఉందో గ్రహించగలుగుతాయి.
ఇలా అవి గాలిలో వేలాడదీసి ఉన్న సన్నని తీగెలను కూడా తప్పించుకుని ఎగరగలగడం విశేషం. రాత్రిపూట సంచరించే నిశాచర (nocturnal) జంతువులైన ఎలుకలు, నక్కలు, గుడ్లగూబల కోవలోకే గబ్బిలాలు కూడా వస్తాయి కాబట్టి అవి రాత్రులే సంచరిస్తాయి.