నటీనటులు: శ్రీకాంత్, వేణు, మీరాజాస్మిన్, రీమాసేన్, కృష్ణభగవాన్, రమ్యశ్రీ, నరేష్, కైకాల సత్యనారాయణ, చలపతిరావు, శివాజీ రాజా తదితరులు.
నిర్మాతలు: అమర్, రాజశేఖర్, సతీష్.
దర్శకత్వం: శ్రీనివాస్‌రెడ్డి
కథ: సీనియర్ నరేష్ దంపతులకు లేకలేక ఓ పాప పుడుతుంది. ఓ గురువు వద్దకు తీసుకెళితే ఆమె అదృష్టవంతురాలనీ, ఐశ్వర్య అనే పేరు పెడితే మీ కంతా ఐశ్వర్యమే అంటాడు. వీరు వెళ్ళాక పక్కనే ఉన్న ఓ వ్యక్తితో గురువు అసలు విషయం చెబుతాడు. అదృష్టవంతురాలైన 22 ఏళ్ళకే చనిపోతుందని. ఆ తర్వాత గురువు చెప్పినట్లు ఆమెతో పాటే ఆస్తి పెరుగుతుంది. కట్‌చేస్తే యమలోకం. యముడు (కైకల సత్యనారాయణ) వృద్ధుడవుతాడు. అందుకే ఆయన వారసునిగా యువ యముడ్ని (శ్రీకాంత్) పట్టాభిషిక్తుడ్ని చేసి మొదటి బాధ్యతగా ఓ అమ్మాయి ప్రాణాలు తీసుకురమ్మని ఆజ్ఞాపిస్తాడు.
ఆ క్రమంలో యువ చిత్రగుప్తుడు (వేణు)తో కలిసి భూలోకంలో నగర సంచారణ చేస్తుంటారు. అనుకోకుండా ఓ అమ్మాయిని రక్షిస్తాడు. యువయముడు. ఆమె మంచితనం కూడా ఆకట్టుకుంటుంది. చివరిగా ఆ అమ్మాయి ప్రాణాలే తాను తీసుకెళ్ళాల్సిందని తెలుస్తుంది. యమపాశం విసిరినా అది వెనక్కి వస్తుంది. ఇదేమిటనే శివుడ్ని వేడుకుంటే ఓ లాజిక్ చెబుతాడు. నా భక్తుడు కన్నప్పకోసం రక్తకన్నీరు కార్చాను. అది భూమిపై పడి ఏకముఖి రుద్రాక్షగ మారింది. అది ఆమె మెడలో ధరించింది. అది ఉన్నంతకాలం మృత్యువు దరిచేరవు. ఆమెకై ఆమె అది తీసేనే మహిమ కోల్పోతుందని అని రహస్యం వివరిస్తాడు.
ఇక వీరితో నారదుడు కూడా కలుస్తాడు. నిజంగా ఇది యమునికి పరీక్షలాంటిదే. కానీ అప్పటికే యువయముడు ఆమె ప్రేమలో పడడంతో ప్రాణం తీయడానికి మనస్సు ఒప్పదు. కానీ చిత్రగుప్తుడు అది తమ కర్తవ్యం ఆమె ప్రాణాన్ని తీయడానికి మొగ్గు చూపుతాడు.... చివరికి ప్రాణం ఎలా తీశాడు? కర్తవ్యంతో ముందుకు సాగిన యువచిత్రగుప్తుడికి వృధ్దయముడు ఏం ఇచ్చాడు? అన్నది చిత్రంలోని అంశం.
సీనియర్ యమునిగా సత్యనారాయణ, చిత్రగుప్తునిగా అల్లురామలింగయ్య, (గ్రాఫిక్స్‌తో), యువ యముడు, చిత్రగుప్తులుదా శ్రీకాంత్, వేణు నటించారు. మరణించే అమ్మాయిగా మీరాజాస్మిన్ నటించింది. ఆమె స్నేహితురాలిగా పోలీసు అధికారిణి పాత్రలో రీమాసేన్, ఇంద్రునిగా చలపతిరావు నటించారు.
ఆద్యంతం కామెడీతోసాగే ఈ చిత్రంలో శ్రీకాంత్, వేణు తమ పాత్రలను న్యాయం చేశారనే చెప్పాలి. భూలోకం వచ్చిన తర్వాత యువచిత్రగుప్తుడు (వేణు) ఓ పోలీస్ అధికారిణి రీమాసేన్ ప్రేమలో పడతాడు. ఇక నారుదునిగా కృష్ణభగవాన్ హాస్యం పండించాడు. వర్గారిటీకి బోలెడు స్కోప్ఉన్న సినిమా. సెన్సార్ వాళ్ళుకూడా కామెడీ చిత్రంగా భావించి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం విశేషం.
దైవానుగ్రహం ఉన్న దేవుని చిత్రాలు చూపినప్పుడల్లా భూలోకం వచ్చేసరికి వారన్నీ మర్చిపోవడం, మాయలు పనిచేయకపోవడం అనే లాజిక్తో చాలా సినిమాలు నడుస్తుంటాయి. "యమదొంగ"లో కూడా యముడు భూలోకంలోకి వట్టి ఎన్.టి.ఆర్‌ను మోసం చేసే క్రమంలో జరిగే పరిణామాలు అటువంటివే. ఇందులో కూడా ప్రాణాలు తీసుకురావాల్సిన అమ్మాయికి ఓ సిద్ధుడు ఇచ్చిన రుద్రాక్ష కాపాడుతుండటం అనేది శివుడ్ని వేడుకునేదాక తెలియకపోవడం.
ఇక యముడు, చిత్రగుప్తులకు వయస్సు మల్లడం గదను కూడా ఎత్తలేని స్థితిరావడం అనేవి కేవలం సరదాగా కథను రాశామే తప్ప వారిని కించపరిచే ఉద్ధేశ్యం కాదని దర్శకుడు షూటింగ్ సమయంలో చెప్పడం కాస్త విమర్శకు దొరక్కుండా జాగ్రత్తపడ్డాడు. కానీ కొన్నిచోట్ల సంభాషణలు, ఇంద్రపాత్రధారికి అమ్మాయిలు కన్పిస్తే ఆయన వజ్రాయుధం లేచినిలబడడం అనే సంఘటనలు పంటిలో రాయిలా అనిపిస్తాయి.
ఇది పూర్తిగా మాస్ ప్రేక్షకుల్ని దృష్టిలో పెట్టుకుని తీసిందే. మరోవైపు యమలోకం కాన్సెఫ్ట్‌తో "యమదొంగ" ఆడుతున్నా అది క్రమేణా కలెక్షన్ల తగ్గుతుండడంతో ఈ చిత్రంపై మాస్ మొగ్గుచూపుతున్నారని పలు థియేటర్ల స్పందన. ఇక గ్రాఫిక్స్ రంగంలో ఉండడంతో యమలోకం సెట్లను, అల్లురామలింగయ్య గెటప్‌ను, స్వర్గీయ ఎన్టీఆర్‌ను, ఘంటసాలను, భారతీయుడు గెటప్‌లో కమల్‌ను చూపించగలగడం విశేషం.