కాలేజీకి వెళ్లే అమ్మాయిలు చీరకట్టుకుని ఆంటీలా వెళ్లకూడదు. కాలేజీకి వెళ్లే అమ్మాయిలాగానే వెళ్లాలి. అలాగే చిత్రంలో మనం పోషించే పాత్రకు అనుగుణంగా, సందర్భోచితంగా వేషాధారణ వుండాలి అంటోంది ఈ బెంగుళూరు మోడల్. ఇంతకీ ఈమె ఎవరో తెలుసా..! ఆమే నండి "బొమ్మరిల్లు" భామ. జెనీలియా డిసౌజా. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నంది పురస్కారాల్లో జెనీలియా బొమ్మిరిల్లు చిత్రంలో ప్రదర్శించిన నటనకు గాను స్పెషల్ జ్యూరీ అవార్డును కైవసం చేసుకున్న విషయం తెల్సిందే.
అయితే "సత్యం" చిత్రం ద్వారా తెలుగు వెండితెరకు పరిచయమైన ఈ భామ నటనకు రాకముందు మోడల్‌గా చేసేది. పార్కర్ పెన్నులు, ఫెయిర్ అండ్ లౌవ్లీ వంటి ఉత్పత్తులకు ప్రచారకర్తగా చేసింది. తెలుగులో సూపర్ డూపర్ హిట్ అయిన "నువ్వే కావాలి" చిత్రం ఆధారంగా నిర్మితమైన "తుఝేమేరీ కసమ్" అనే చిత్రంతో బాలీవుడ్‌కు పరిచమైంది. ఆ చిత్రం ఘోర పరాజయం చెందడంతో బాలీవుడ్‌లో నిలదొక్కుకోలేక పోయింది.
ఆ తర్వాత శంకర్ దర్శకత్వంలో వచ్చిన "బాయ్స్" చిత్రంలో అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. అక్కడ నుంచి ఈ భామకు తెలుగులో అవకాశాలు రాసాగాయి. 'సై', 'సాంబ', 'బొమ్మరిల్లు', 'ఢీ', 'మిస్టర్ మేథావి' వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో ఆమెతో "వెబ్‌దునియా తెలుగు" సాగించిన ఇంటర్వ్యూ విశేషాలు మీకోసం...
ప్రశ్న:- నేటి సమాజంలో వస్త్రధారణ ఎలా వుండాలని అనుకుంటున్నారు?
జ:- ఇదే విషయమై ఓ సారి నాకు దర్శకులకు మధ్య వాదన జరిగింది. (సినిమా పేరు వద్దులెండి). మీరు మోడ్రన్‌గా ఉంటేనే బాగుంటుంది. ఇప్పటి డ్రస్సులు ఇలాగే ఉంటాయని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. ఢిల్లీ, ముంబైలలో కాలేజీ అమ్మాయిలు ఎలా ఉంటారని నన్ను ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా శృతి మించని డ్రస్సులే వేస్తుంటాను.
ప్రశ్న:- గ్లామర్ పేరుతో శృతిమించుతోందన్న విమర్శలకు సమాధానం?
జ:- అందరూ చెప్పేదే. పాత్ర స్వభావానికి తగినట్లుగా ఉంటుంది. దానికి తగినట్లే వస్త్రధారణ వేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు కాలేజీకి వెళ్ళే అమ్మాయి చీరకట్టుకుని వెళితే... అందరూ ఆంటీ అంటూ ఆట పట్టిస్తారు. అలాగనీ మనం చీరకట్టుకుని వెళ్లలేం కదా. అందుకే సందర్భోచితంగా మనం, మన వేషధారణ వుండాలని నా భావన.
ప్రశ్న:- నంది అవార్డు రావడం పట్ల మీరెలా ఫీలవుతున్నారు.?
జ:- నాకంటే మా తల్లిదండ్రులు గర్వంగా ఫీలయ్యారు. నా విజయాల వెనుక అండదండలు వారే. వాళ్ళు నన్నెంతో ప్రోత్సాహిస్తుంటారు. ముఖ్యంగా మా అమ్మ ఉత్తమ విమర్శకురాలు.
ప్రశ్న:- పరభాషా నటీమణికి అవార్డు దక్కడం ఎలా అనిపిస్తుంది?
జ:- ఇంతవరకు అలాంటి ఫీలింగ్ అనేది లేదు. నన్ను గుర్తించినందుకు జ్యూరీకమిటీకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆర్టిస్టుగా ఎక్కడున్నా నటన ఒక్కటే. కళారంగానికి మూలపురుషుడు నటరాజును అందరూ పూజిస్తారు. కళకు ప్రాంతీయ తత్వాలు ఉండవు కదా?
ప్రశ్న:- మీపై వచ్చే పుకార్లకు (గాసిప్స్) మీరెలా స్పందిస్తారు?
జ:- సినీగ్లామర్ పరిశ్రమలో పుకార్లు అనేవి సహజం. ఇవి కొన్ని సందర్భాల్లో మనసును గాయపరుస్తాయి. ఇలాంటి వార్తలు కూడా రాస్తుంటారా? అని బాధ కలుగుతుంది. ఏం చేయలేం కదా?
ప్రశ్న:- మీరు ఎలాంటి పాత్రలు చేయాలని భావిస్తున్నారు.?
జ:- గ్లామర్ పాత్రలకే మొదట ప్రాధాన్యత ఇస్తూ నటనకు అవకాశం ఉన్నవి చేస్తాను. గ్లామర్ ఫీల్డు గనుక గ్లామర్‌గా ఉండాలంటారు. ఏది చేసినా మంచి నటిగా పేరు తెచ్చుకోవాలన్నదే లక్ష్యం.
ప్రశ్న... చిత్ర పరిశ్రమలో మీకు నచ్చిన నటీనటులు?
జ... షారూఖ్, కాజోల్, పవన్ కళ్యాణ్, సౌందర్య, స్నేహ.