'పోకిరి' చిత్రం ద్వారా ఐటంగర్ల్‌గా తెలుగు చిత్ర రంగం ప్రవేశం చేసిన ముమైత్ ఖాన్.. చిన్నగా తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్ స్థాయికి ఎదిగిపోయింది. 'పోకిరి' చిత్రంలో 'ఇప్పటికింకా నా వయస్సు నిండా పదహారే' అనే పాటతో యువతను ఉర్రూతలూగించిన ముమైత్.. ఆ తర్వాత 'ఆపరేషన్ దుర్యోధన', 'ఎవడైతే నాకేంటి' చిత్రాల్లో నటించింది. ఈ చిత్రాల్లో ఆమె నటనకు ఎన్నో ప్రశంసలు వచ్చాయి.
దీంతో ఒక్కసారిగా ఆమె హీరోయిన్ రేంజ్‌కు ఎదిగిపోయింది. త్వరలో విడుదల కానున్న 'మైసమ్మ ఐపీఎస్' చిత్రంలో ముమైత్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం విడుదల కాకమునుపే ఆమె మరో చిత్రంలో హీరోయిన్‌గా నటించేందుకు ఎంపికైంది. 'కబడ్డి కబడ్డి' చిత్ర ఫేం వెంకీ దర్శకత్వం వహించే 'మంగతయారు టిఫిన్ సెంటర్' చిత్రంలో ముమైత్ కథానాయిక పాత్రను పోషించనుంది.
ఈనెల 21వ తేదీనుంచి షూటింగ్ జరుపుకోనున్న ఈ చిత్రాన్ని వచ్చే డిసెంబరు నాటికి పూర్తి చేసేందుకు నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. పూర్తిస్థాయి వినోదాత్మకంగా సాగే ఈ చిత్రాన్ని కె.పైడిబాబు నిర్మిస్తుండగా, ఎంఎం.శ్రీలేఖ సంగీత బాణీలను సమకూర్చనున్నారు.