Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నాలుగు యుగాల్లో దీపావళి.. లక్ష్మీదేవినే ఎందుకు పూజించాలి?

నాలుగు యుగాల్లో దీపావళి.. లక్ష్మీదేవినే ఎందుకు పూజించాలి?
, శుక్రవారం, 26 అక్టోబరు 2018 (18:01 IST)
నాలుగు యుగాల్లోనూ దీపావళి పండుగను ఆనందోత్సహాలతో జరుపుకున్నారనేందుకు చరిత్ర వుంది. శ్రీమహా విష్ణువు వామనావతారుడై కృతయుగంలో రాక్షసరాజు బలి చక్రవర్తిని పాతాళానికి అణచివేశాడు. అది బలిపాలన అంతమైన రోజు. ఆ రోజున దీపావళిని జరుపుకున్నారు. అలాగే  త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు రావణాసురుణ్ణి వధించి తిరిగి ఆ రోజు అయోధ్యలో ప్రవేశించిన శుభదినం. 
 
ఇక ద్వాపర యుగంలో నరకాసురుణ్ణి వధించిన రోజునే దీపావళిగా మనం జరుపుకుంటూ వస్తున్నాం. ఇక కలియుగంలో విక్రమశక స్థాపకుడైన విక్రమార్కుడు పట్టాభిషిక్తుడైన రోజు కూడా దీపావళి నాడేనని పురాణాలు చెప్తున్నాయి. ఇలా నాలుగు యుగాల్లోనూ సంభవించిన వివిధ రకాల కారణాలతో ఈ విజయాలకు సూచికగా దీపావళి పర్వదినాన్ని జరుపుకుంటున్నట్లు ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.
 
అలాగే దీపావళి పర్వదినం రోజు ఆ జగన్మాత మహాలక్ష్మీదేవిని సర్వోపచారాలతో పూజిస్తారు. దీపావళి పర్వదినం రోజున ప్రత్యేకించి లక్ష్మీదేవిని పూజించడానికి గల కారణాలు ఏంటంటే?
 
పూర్వం దుర్వాస మహాముని ఇంద్రుడి ఆతిథ్యానికి సంతోషించి మహిమగల ఒక హారం అతడికి బహూకరించాడు. కానీ ఇంద్రుడు ఆ హారం మహిమను, గొప్పతనాన్ని గుర్తించకుండా దాన్ని తన వాహనమైన ఐరావతం మెడలో వేశాడు. ఆ హారాన్ని ఐరావతం కాలితో తొక్కేసింది. ఆ పాపానికి ఫలితంగా దేవేంద్రుడు రాజ్యాన్ని కోల్పోయాడు. 
 
ఈ దీనస్థితి నుంచి గట్టెక్కేందుకు ఇంద్రుడు శ్రీహరిని స్తుతించగా.. ఒక దీపాన్ని వెలిగించి దాన్ని లక్ష్మీ స్వరూపంగా భావించి భక్తి శ్రద్ధలతో పూజించమని చెప్పాడు. ఆ పూజలు ఆచరించిన దేవేంద్రునిపై లక్ష్మీదేవి కరుణాకటాక్షం లభించింది. దీంతో ఇంద్రుడు తిరిగి రాజ్యాన్ని పొందగలిగాడు. ఇంకా దేవలోకాధిపత్యం లభించింది. అప్పటినుంచి ఇప్పటివరకు ఎవరైతే దీపావళి రోజున దీపం వెలిగించి లక్ష్మీదేవిని పూజిస్తారో ఆ భక్తుల ఇంట లక్ష్మీదేవి స్థిరంగా వుంటుందని విశ్వాసం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దీపావళి పండుగ ఎలా వచ్చిందో తెలుసా..?