Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తిరుమల రూ.300 టిక్కెట్ దర్శనంలో చుక్కలు కనబడుతున్నాయ్ గోవిందా

Advertiesment
Tirumala Rush

ఐవీఆర్

, శనివారం, 12 జులై 2025 (16:59 IST)
భక్తులకు సులభ దర్శనం అని చెబుతున్నారు. ఏఐ టెక్నాలజీ వాడుకుంటున్నామని చెబుతున్నారు. ఐతే రూ. 300 టిక్కెట్ కొని దర్శనానికి వెళ్తున్న భక్తులకు మాత్రం గోవిందుడి దర్శనానికి ముందు చుక్కలు కనబడుతున్నాయి. రూ. 300 టిక్కెట్ పైన దర్శనాలకు వెళ్తున్న భక్తులు దర్శన సమయంలో తాము ఎంతటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో చెబుతున్నారు.
 
ఇదివరకు కేవలం స్లాట్ కేటాయించిన సమయానికి వెళితే కేవలం గంటలోపే తిరుమల శ్రీవారి దర్శన భాగ్యం కలిగేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే.. సాయంత్రం 4 గంటలకు స్లాట్ కేటాయించిన భక్తులలోకి, 5 గంటలు, 6 గంటలు, 7 గంటలకు రావాల్సిన వారు కూడా వచ్చేస్తున్నారు. ఏ స్లాట్ ప్రకారం ఆ స్లాట్ వారికి దర్శనం కల్పించేందుకు వీలుగా తనీఖీలు లేవు. ఎవరు ఎప్పుడు వచ్చినా రూ. 300 కౌంటర్లోకి వెళ్లిపోవచ్చు. దీనితో తాము వెళ్లాల్సిన సమయంలోకి వేరే స్లాట్ భక్తులు చేరిపోతున్నారు. ఫలితంగా దర్శన సమయం పెరిగిపోతోంది. గంటలోపుగా జరగాల్సిన సమయంలో ఐదారు గంటలు పడుతోంది.
 
దీనికితోడు... రూ. 300 టిక్కెట్ పైన వెళ్లే భక్తులను కనీసం 2 కిలోమీటర్ల మేర పాము మెలికల్లాంటి క్యూ లైన్లలో తిప్పి తిప్పి హింసిస్తున్నారంటూ భక్తులు వాపోతున్నారు. ఇలా క్యూ లైనులో గంటలకొద్దీ నిలబెట్టడంతో రెండుమూడేళ్ల బిడ్డలతో వచ్చే భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఇంకోవైపు గంటలకొద్దీ క్యూ లైన్లలో నిలబెట్టి భక్తులను తీవ్ర అసహనానికి గురి చేయడమే కాకుండా కనీసం తినేందుకు శ్రీవారి ప్రసాదం కూడా అందించడంలేదు.
 
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. క్యూ లైన్లలోకి, గ్యాలరీల లోకి బైట నుంచి ఫ్రూటీ ప్యాకెట్లు అమ్మేందుకు ఇతరులు లోనికి రావడం. ఇదంతా గందరగోళంగా అనిపించింది. మొత్తంగా చూస్తే సౌకర్యాలు ఏమీ బాగాలేదని భక్తులు పెదవి విరుస్తున్నారు. అలా గంటల పాటు క్యూలైన్లలో నిలువుకాళ్లపై నిలబడి గోవిందుడి దర్శనం అయ్యాక వెంగమాంబ అన్నప్రసాదం తిందామని వెళితే... సగం బియ్యంతో వున్న అన్నం వెక్కిరిస్తోంది. అలా దేవుడిని చూసామన్న తృప్తి తప్ప ఎక్కడ కూడా తితిదే చేస్తున్న సౌకర్యాలపై తృప్తి ఇసుమంత కూడా లేదని ఓ భక్తుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇక సర్వదర్శనం చేసుకునే భక్తుల గురించి వేరే చెప్పక్కర్లేదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బీజేపీ నేత బండారం బయటపడింది.. స్మశానంలో కారును నిలిపి.. కారులోనే రాసలీలలు (video)