నల్లధనం జమ చేస్తే జన్‌ధన్ బ్యాంకు ఖాతాదారులకు చిక్కులే: కేంద్రం వార్నింగ్
నల్లకుబేరులతో పాటు జన్‌ధన్ ఖాతాదారులకు కేంద్రం వార్నింగ్ ఇచ్చింది. జన్‌ధన్ బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ముఖ్యంగా ఈ ఖాతాదారులు అన్ని రకాల రాయితీలను కోల్పోయే ప్రమా
నల్లకుబేరులతో పాటు జన్‌ధన్ ఖాతాదారులకు కేంద్రం వార్నింగ్ ఇచ్చింది. జన్‌ధన్ బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ముఖ్యంగా ఈ ఖాతాదారులు అన్ని రకాల రాయితీలను కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపింది.
దేశంలో రూ.500, రూ.1000 నోట్ల రద్దుతో నల్లధనకుబేరులు నిద్రలేమి రాత్రులు గడుపుతున్నారు. అయితే, తమ వద్ద ఉన్న నల్లధానాన్ని తెల్లధనంగా మార్చుకునేందుకు అక్రమార్జన సంపాదనపరులు పలు మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇందులోభాగంగా వారు దళారులను ఆశ్రయిస్తున్నారు. వీరి ద్వారా తమ వద్ద ఉన్న నల్లధనాన్ని జన్‌ధన్ ఖాతాదారుల ద్వారా బ్యాంకుల్లో జమ చేయించి.. ఆ తర్వాత విత్‌డ్రా చేయిస్తున్నారు. ఈ విషయాన్ని పసిగట్టిన కేంద్రం జన్‌ధన్ ఖాతాదారులకు గట్టి షాక్ ఇచ్చింది.
నోట్ల రద్దు తర్వాత బ్లాక్‌మనీ దారుల ప్లాన్‌ను చూసి కేంద్రం ఖంగుతింది. రకారకాల మార్గాల్లో పక్కాగా, లీగల్‌గా నల్లకుబేరులు సాగించిన లావాదేవీలను మార్చుకుంటున్న నోట్లను ఆలస్యంగా గుర్తించింది. వారం రోజుల పాటు ఉధృతంగా జరిగిన పరిణామాలతో ఆర్‌బీఐ వ్యూహం మార్చింది. ఆంక్షలు పరిమితుల్లో మార్పులు చేసింది. లావాదేవీలపై నిఘా పెడతామని ముందు నుంచి చెబుతున్న కేంద్రం ఇప్పుడు నోటీసులు జారీ చేయడంలో నిమగ్నమైంది.
దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఇప్పుడు జోరుగా పోస్టింగులు సాగుతున్నాయి. సిక్కింలో ఓ వ్యాపార సంస్థకు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 13వ తేదీన ఆ సంస్థకు చెందిన బ్యాక్ అకౌంటులో 4 లక్షల 51 వేల రూపాయలు డిపాజిట్ చేశారని ఆడబ్బు రాబడికి సంబంధించిన వివరాలు అందించాలని నోటీసుల్లో ఉంది. ఈ పరిణామంతో ఇప్పుడు జన్‌ధన్ ఖాతాదారుల పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక మాదిరిగా తయారైంది. జీరో బ్యాలెన్స్‌తో లావాదేవీలు కొనసాగించే ఈ ఖాతాల్లోకి ఒక్కసారిగా డబ్బులు ఎలా జమ అవుతున్నాయనే అంశంపై దృష్టిసారించి, వాటి వివరాలు అందించాల్సిందిగా అన్ని బ్యాంకులను కోరినట్టు వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే.. జన్‌ధన్ ఖాతాదారులకు చిక్కులు తప్పక పోవచ్చు.