లక్ష రూపాయలు చెల్లిస్తే సాఫ్ట్‌వేర్ ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఓ వ్యక్తి అనేక మంది నిరుద్యోగ యువకులను నమ్మించాడు. పైగా, ఐటీ ఉద్యోగాల పేరిట ఆన్‌లైన్‌లో భారీగా ప్రకటనలు ఇచ్చాడు. వాటిని చూసిన నమ్మి తన వద్దకు వచ్చిన వారిని నిలువునా ముంచాడు. ఒక్కొక్కరి నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసి బోర్డు తిప్పేశాడు. ఈ ఘటన హైదరాబాద్ మాదాపూర్ హైటెక్ సిటీలో వెలుగులోకి వచ్చింది. బాధితుల్లో ఆటో, క్యాబ్ డ్రైవర్లు ఉన్నారు. నిందితుడు గతంలోనూ ఇలా కొందరిని మోసగించినట్లు బాధితులు చెప్పారు. ఈ వివరాలను పరిశీలిస్తే..
వెస్ట్ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన ప్రతాప్ కట్టమూరి(25) ఈ ఏడాది ఫిబ్రవరిలో మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీలో డాన్యన్ ఐటీ టెక్నాలజీ ప్రై లిమిటెడ్ పేరిట సాఫ్ట్‌వేర్ సంస్థను నెలకొల్పాడు. సంస్థకు తాను బిజినెస్ డెవలప్‌మెంట్ మేనేజర్‌నని ప్రచారం చేసుకున్నాడు. నియామకాలు చేపడుతున్నామని.. ఆసక్తి ఉన్న వారు సంప్రదించాలంటూ ఫేస్‌బుక్‌లో హైదరాబాద్ జాబ్స్ పేజీలో పోస్టు చేశాడు.
దీంతో ఆయన్ను దాదాపు 200 మంది వరకు నిరుద్యోగులు సంప్రదించారు. ఉద్యోగం కావాలంటే మూడు నెలల శిక్షణ తీసుకోవాలని.. తర్వాత ప్లేస్‌మెంట్ ఉంటుందని నమ్మించాడు. ఒక్కొక్కరి నుంచి రూ.లక్ష నుంచి లక్షన్నర వరకు వసూలు చేశాడు. శిక్షణ కాలంలో నెలకు రూ.20 వేల చొప్పున భృతి.. ఉద్యోగం వచ్చాక రూ.30 వేల జీతం ఇస్తానని నమ్మించాడు.
దీంతో పలువురు నిరుద్యోగులు లక్ష నుంచి రూ.1.50 లక్షలను ఆన్‌లైన్ లేదా నేరుగా డబ్బులు చెల్లించారు. అందర్నీ శిక్షణకు తీసుకున్నట్లు నమ్మించి, గూగుల్ మీట్‌లో తరగతులు నిర్వహించేవాడు. శిక్షణ ప్రారంభించి నెలలవుతున్నా భృతి చెల్లించలేదు. ఉద్యోగం ఇవ్వలేదు. అందరికీ వర్క్ ఫ్రం హోం అని చెప్పాడు. అనుమానం వచ్చి కొందరు నిలదీసినా స్పందించలేదు.
కొందరికి మాత్రం రూ.6 వేల చొప్పున ఇచ్చి మిన్నకున్నాడు. మరికొందరు సెప్టెంబరు ఆరో తేదీన అయ్యప్ప సొసైటీలోని కార్యాలయానికి వెళ్లి ప్రతాప్‌తో గొడవకు దిగారు. ఈ సమయంలో నరసింహా రెడ్డి అనే వ్యక్తి వచ్చి, తాను వైతెపా నాయకుడినని, వారం రోజులు ఆగాలని, కంపెనీని త్వరలో తాను స్వాధీనం చేసుకుంటానని, అక్టోబరు నుంచి ఉద్యోగం, వేతనాలు ఇస్తామంటూ నమ్మబలికాడు.
సెప్టెంబరు 20 దాటినా స్పదించలేదు. ఫోన్ చేస్తే.. ప్రతాప్ ఆచూకీ తెలియడంలేదని బదులిచ్చారు. బాధితులు సైఫాబాద్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లగా.. మాదాపూర్ ఠాణాకు పంపించారు. ప్రతాప్‌ను పట్టుకునేందుకు ప్రణాళిక వేసిన బాధితులు, ఓ యువతితో ఫోన్ చేయించారు. డబ్బులిస్తామని చెప్పి నమ్మించి అసెంబ్లీకి ఎదురుగా పట్టుకున్నారు. అయితే పోలీసులు మాత్రం అతనిపై కేసు నమోదు చేయకుండా జాప్యం చేస్తుండటం గమనార్హం.