అకతాయి వేధింపులను భరించలేని ఓ యువతి చివరకు బలవన్మరణానికి పాల్పడింది. ప్రాణం విడిచే ముందు కొన ఊపిరితో తన తమ్ముడు, పెద్దనాన్న కుమారుడికి రాఖీ కట్టి తనువు చాలించింది. ఈ విషాదకర ఘటన తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లా నర్సింహులు పేట మండలంలోని ఓ గ్రామంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
మహబూబాబాద్ జిల్లా నర్సింహులు పేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన విద్యార్థిని (17) కోదాడలో పాలిటెక్నిక్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. ఖమ్మం పట్టణానికి చెందిన ఓ ఆకతాయి ప్రేమ పేరుతో తరచూ వేధిస్తుండడంతో మనస్తాపం చెందిన ఆమె గత గురువారం గడ్డిమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది.
దీన్ని గమనించిన కుటుంబ సభ్యులు ఆ యువతిని మహబూబాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించగా, ఐసీయూ వార్డులో చికిత్స పొందుతూ వచ్చింది. సోమవారం రక్షాబంధన్ వరకు తాను ఉంటానో లేదోనంటూ.. ఆమె శనివారం రాత్రి తన తమ్ముడితోపాటు పెదనాన్న కుమారుడికి రాఖీ కట్టింది. అనంతరం ఆదివారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఆమె కన్నుమూసింది.
కాగా, విద్యార్థినిపై వేధింపులకు పాల్పడిన ఆకతాయిపై పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ తదితర చట్టాల కింద కేసు నమోదు చేసినట్లు నర్సింహులు పేట పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
హెల్త్ వర్కర్ల రక్షణ కోసం ప్రత్యేక చట్టం - ప్రధాని మోడీకి అవార్డు గ్రహీతల లేఖ
కొనఊపిరితో కొట్టుమిట్టాడే మనిషికి ప్రాణం పోస్తూ, ప్రత్యక్ష దైవాలుగా ఉన్న వైద్యులు, వైద్య సిబ్బందిపై దాడులు జరుగుతున్నాయి. వీటిపై దేశ పౌరులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా, ఇటీవల కోల్‌కతాలోని ఆర్జీ కర్ వైద్య కాలేజీ, ఆస్పత్రిలో జూనియర్ మహిళా వైద్యురాలిపై హత్యాచారం జరిగింది. ఈ కేసులో నిందితులను రక్షించేందుకు సాక్షాత్ ఆ రాష్ట్ర ప్రభుత్వమే కంకణం కట్టుకుందనే విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఈ హింసాత్మక దాడులకు అడ్డుకట్ట వేసేలా చట్టాన్ని తీసుకురావాలన్న డిమాండ్లు పెరిగిపోతున్నాయి.
దేశంలో హెల్త్ వర్కర్లపై జరుగుతున్న దాడులు, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జోక్యం చేసుకోవాలని పద్మశ్రీ అవార్డు పొందిన వైద్యులు కోరారు. సాధ్యమైనంత త్వరగా దీనికి పరిష్కార మార్గం కనుగొనాలని వారు ఓ లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోడికి లేఖ రాసిన వారిలో ఐసీఎంఆర్ మాజీ డైరెక్టర్ జనరల్ డా.బలరాం భార్గవ, ఢిల్లీ ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ డా.రణ్‌దీప్ గులేరియా, ఇనిస్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిలైరీ సైన్సెస్ డైరెక్టర్ డా.ఎస్ కే సారిన్, తదితరులు ఉన్నారు.
దేశంలో వైద్యరంగానికి చెందిన 70 మంది పద్మశ్రీ అవార్డు గ్రహీతలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కీలక లేఖ రాశారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోడీ జోక్యం చేసుకోవాలని, ఇలాంటి క్రూరమైన చర్యలు వైద్య సేవలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని పేర్కొన్నారు. అదేసమయంలో కోల్‌కతాలో మహిళా మెడికోపై హత్యాచారం ఘటనను యావత్ దేశం ఖండిస్తోంది. క్రూరమైన ఈ ఘటనను నిరసిస్తూ, ఆస్పత్రుల్లో వైద్యులకు పటిష్టమైన భద్రత కల్పించాలంటూ ఇప్పటికే వైద్యులు ఆందోళన బాటపట్టారు. వారికి అన్ని వర్గాలు సంఘీభావం తెలుపుతున్నాయి.