తన స్నేహితుడిని కలిసేందుకు వచ్చిన యువతికి అడ్రెస్ చూపిస్తానంటూ అత్యాచారం చేయబోయాడు ఆటోడ్రైవర్. ఈ ఘటన విజయవాడలో జరిగింది. యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కేసులో వేగంగా స్పందించారు పోలీసులు.
సిపి కాంతిరాణా టాటా మాట్లాడుతూ... 100 డయల్‌కు కాల్ వచ్చిన వెంటనే ఘటనా ప్రదేశానికి చేరుకొని ఆటో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నాం. యువతిని క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించాము. తన స్నేహితుడి కోసం నిన్న రాత్రి 10 గంటలకు యువతి విజయవాడకు చేరుకుంది.
స్నేహితుడు బసచేసిన హోటల్ అడ్రెస్ కోసం ఆటో డ్రైవర్‌ను యువతి ఆశ్రయించింది. ఆటో డ్రైవర్ బాడుగ విషయంలో యువతికి, ఆటో డ్రైవర్‌కు వాగ్వివాదం జరిగింది. యువతి చేయి పట్టుకొని అసభ్యంగా ప్రవర్తించాడు ఆటో డ్రైవర్. దీనితో యువతి ఆటో డ్రైవర్‌ను ప్రతిఘటించి, 100కు కాల్ చేసింది. 5 నిమిషాల్లో ఘటనా ప్రదేశానికి చేరుకున్నాం.
ఆటో డ్రైవర్‌ను వెంటనే అదుపులోకి తీసుకున్నాం. మహిళలు, యువతులు ఒంటరిగా సమయం కాని సమయంలో బయటకు వచ్చేటప్పుడు కుటుంబ సభ్యుల సహకారం తీసుకోవడం మంచిది. ముఖపరిచయం లేని వ్యక్తులను నమ్మొద్దు. మహిళలు, యువతుల పట్ల అసభ్యంగా, అమర్యాదగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదు. మహిళలు, యువతులు దిశ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోవాలి. మహిళలకు ఆపద సమయంలో దిశ యాప్ రక్షణ కవచంలా ఉపయోగపడుతుంది.'' అని తెలిపారు.