ఐపీఎల్‌లో తననెందుకు పక్కనబెట్టారంటూ టీమిండియా క్రికెటర్ మనోజ్ తివారీ అడిగాడు. రాజస్థాన్ వేదికగా ఐపీఎల్ 12వ సీజన్ కోసం వేలం పాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేలం పాటలో తనను ఫ్రాంచైజీలు శుభ్రంగా మరిచిపోయాయని.. ఇంతకీ తనను విస్మరించే రీతిలో తానేం తప్పు చేశానో తనకు తెలియట్లేదని మనోజ్ తివారీ అన్నాడు.
దీంతో మనస్తాపం చెందిన మనోజ్ తివారీ.. తనను కొనుగోలు చేయకపోవడానికి గల కారణం ఏమిటని ట్విట్టర్‌లో ప్రశ్నించాడు. అంతేగాకుండా మనోజ్ తివారీ తాను సాధించిన రికార్డులను, ట్రోఫీలను కూడా షేర్ చేశాడు.
భారత్ తరపున సెంచరీ సాధించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పొందిన తర్వాత వరుసగా 14 మ్యాచ్‌లలో తప్పించారని.. 2017 ఐపీఎల్‌లో సాధించిన అవార్డులను చూస్తుంటే.. ఏం తప్పు చేశానో తనకు తెలియట్లేదన్నాడు.
దీనిపై నెటిజన్లు కూడా ఐపీఎల్ ఫ్రాంచైజీలను తప్పుబడుతున్నారు. క్రేజున్న ఆటగాళ్లే కాకుండా రికార్డులున్న.. మైదానంలో రాణించగలిగే సత్తా వున్న క్రికెటర్ల పట్ల ఫ్రాంచైజీలు ఎందుకు దృష్టి పెట్టలేదని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు.