భారత వన్డే క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ గత కొంతకాలంగా టీ20 మ్యాచ్‌లకు దూరంగా ఉంటున్నాడు. దీంతో క్రికెట్ వర్గాల్లో ఓ సరికొత్త చర్చ సాగుతుంది. టీ20 ఫార్మెట్ నుంచి రోహిత్ శర్మ వైదొలగారనే ప్రచారం జోరుగా సాగుతుంది. అలాగే మరో స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ సైతం టీ20లకు దూరంగా ఉంటున్నారు.
అప్పటి నుంచి ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు. అతను అందుబాటులో లేనపుడు తాత్కాలిక కెప్టెన్ల నాయకత్వంలో ఆడుతోంది. వచ్చే ఏడాది పొట్టి ప్రపంచకప్ ఉన్న నేపథ్యంలో రోహిత్, కోహ్లి టీ20 జట్టులోకి పునరాగమనం చేస్తారా అన్న చర్చ జరుగుతోంది. అయితే కోహ్లి సంగతేమో కానీ.. రోహిత్ అయితే మళ్లీ టీ20లు ఆడే అవకాశాలు లేవని సమాచారం.
దీనికి కారణం లేకపోలేదు. రోహిత్‌కు 36 ఏళ్లు నిండాయి. ఏడాది పాటు టీ20లకు దూరంగా ఉన్న అతను.. కెరీర్లో ఈ దశలో తిరిగి టీ20 జట్టులోకి రావాలని, కుర్రాళ్ల అవకాశాలకు అడ్డంకిగా మారాలని అనుకోవట్లేదని బీసీసీఐ వర్గాల సమాచారం. 'ఇదేం కొత్త విషయం కాదు. వన్డే ప్రపంచకప్ మీద దృష్టితో గత ఏడాది కాలంగా రోహిత్ టీ20లు ఆడలేదు. చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌తో అతను చర్చించిన అనంతరం తాను టీ20లకు దూరంగా ఉండాలని రోహిత్ నిర్ణయించుకున్నాడు. ఇది పూర్తిగా అతడి నిర్ణయమే' అని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు.