భారత్-పాకిస్థాన్‌ల మధ్య క్రికెట్ సిరీస్ జరగటం లేదు. ఇంకా ఇతర దేశాలు కూడా పాకిస్థాన్‌లో పర్యటించేందుకు ఆసక్తి చూపట్లేదు. ఎందుకంటే.. ఉగ్రమూకల భయంతో పాక్‌లో క్రికెట్ ఆడాలంటేనే జడుసుకుంటున్నాయి. ఉగ్రవాదులపై పాకిస్థాన్ సర్కారు ఉక్కుపాదం మోపకపోవడం కారణంగా పాకిస్థాన్‌లో క్రికెట్ ఆడాలంటేనే ప్రపంచ దేశాలు ఆమడ దూరంలో నిలుస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా వంటి జట్లు పాకిస్థాన్‌లో పర్యటించాలని మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎమ్‌సీసీ) అధ్యక్షుడు కుమార సంగక్కర తెలిపాడు. 2009లో పాకిస్థాన్ పర్యటనలో ఉన్న శ్రీలంక జట్టుపై ఉగ్రదాడి జరిగినప్పటి నుంచి ఆ దేశంలో పర్యటించేందుకు ఇతర జట్లు జంకుతున్నాయి. అయితే దశాబ్దం అనంతరం ఇటీవలే వెస్టిండీస్ జట్టు పాకిస్థాన్‌లో పర్యటించింది.
ఇలా పాకిస్థాన్‌లో క్రికెట్ మ్యాచ్‌లు పునరుద్ధరించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న సంగక్కర తాజాగా.. అగ్రజట్లు పాక్ పర్యటనకు వస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు. పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తామని కూడా హామీ ఇచ్చాడు. "ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా వంటి జట్లు పాక్‌లో పర్యటించాలి. పటిష్ట భద్రత నడుమ మ్యాచ్‌లు ఆడటంలో ఎలాంటి ఇబ్బంది ఉండదనుకుంటున్నా. ప్రస్తుతం సుదీర్ఘ పర్యటనలపై ఎవరు మక్కువ చూపడం లేదు'' అని సంగక్కర అన్నాడు.
అయితే సంగక్కర విజ్ఞప్తిపై ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా ఎలా స్పందిస్తాయో తెలియట్లేదు. ఇప్పటికే కరోనాతో ప్రపంచ దేశాలు క్రీడలను పక్కనబెట్టేసిన తరుణంలో పాకిస్థాన్‌లో ఇతర దేశాల పర్యటన ఎలా జరుగుతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.