ఐపీఎల్ 16వ సీజన్ తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వం పేలవంగా ఉందని భారత క్రికెట్ జట్టు మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నారు. తొలి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టు చేతిలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు చేజేతులా ఓడిన విషయం తెల్సిందే. దీనిపై వీరేంద్ర సెహ్వాగ్ విమర్శలు గుప్పించారు.
ఈ మ్యాచ్‌లో కెప్టెన్ ధోనీ చేసిన పొరపాట్లు తనను ఆశ్చర్యానికి గురిచేశాయని సెహ్వాగ్ తెలిపాడు. ఇంపాక్ట్ ప్లేయర్ తుషార్ దేశ్‌పాండేను ధోని ఉపయోగించిన విధానాన్ని సెహ్వాగ్ తప్పుబట్టాడు. 'భారీగా పరుగులిచ్చిన తుషార్‌తో కాకుండా మొయిన్ అలీతో ధోని మధ్యలో ఒక ఓవర్ వేయించాల్సిందన్నారు.
ముఖ్యంగా, ధోని తరుచుగా ఇలాంటి పొరపాట్లు చేస్తాడని ఆశించరు. కానీ కుడిచేతి వాటం బ్యాటర్లు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఆఫ్ స్పిన్నర్‌తో బౌలింగ్ చేయించి ఫలితం రాబట్టాల్సింది' అని సెహ్వాగ్ అభిప్రాయపడ్డారు. దేశవాళీ క్రికెట్లో పాత బంతితో బౌలింగ్ చేసే తుషార్‌తో ఆరంభంలో ఓవర్లు వేయించడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని భారత మాజీ బ్యాటర్ మనోజ్ తివారి అన్నాడు.