Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ధర్మశాల టెస్ట్ మ్యాచ్ : సెంచరీలతో కదంతొక్కిన రోహిత్ - గిల్

rohith sharma

ఠాగూర్

, శుక్రవారం, 8 మార్చి 2024 (12:37 IST)
ధర్మశాల వేదికగా పర్యాటక ఇంగ్లండ్ జట్టుతో జరుగుతున్న చివరిదైన ఐదో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో పటిష్టమైన స్థితిలో ఉంది. భారత జట్టు ఆటగాళ్లు రోహిత్ శర్మ, శుభమన్ గిల్‌లు సెంచరీలతో అదరగొట్టారు. వీరిద్దరూ అద్భతమైన సెంచరీలతో ఆకట్టుకున్నారు. ఈ సిరీస్‌లో వీరిద్దరికీ ఇవి రెండో శతకాలు కావడం గమనార్హం. ఫలితంగా రెండో రోజైన శుక్రవారం మధ్యాహ్నం లంచ్ బ్రేక్ సమయానికి 60 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 264 పరుగులు చేసింది. 
 
ఈ టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో218 పరుగులకే ఆలౌట్‌ అయిన విషయం తెల్సిందే. భారత స్పిన్నర్ల ధాటికి ఇంగ్లండ్ బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలిపోయింది. కానీ, భారత్ విషయానికి వచ్చేసరికి పరిస్థితి అంతా మారిపోయింది. ఇదే పిచ్‌పై రోహిత్‌, గిల్‌ భారీ షాట్లతో చెలరేగారు. ప్రత్యర్థి బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా శతకాలు పూర్తి చేశారు. రోహిత్‌ 154 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్స్‌లతో సెంచరీ కొట్టగా.. కాసేపటికే గిల్‌ 141 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్స్‌లతో శతకం సాధించాడు.
 
ఈ సెంచరీతో అంతర్జాతీయ క్రికెట్‌లో రోహిత్‌ 48 శతకాలకు చేరుకున్నాడు. భారత్‌ తరపున అత్యధిక సెంచరీలు బాదిన వారి జాబితాలో రాహుల్‌ ద్రవిడ్‌ సరసన మూడో స్థానంలో ఉన్నాడు. ఓపెనర్‌గా అంతర్జాతీయ క్రికెట్‌లో ఎక్కువ శతకాలు బాదిన వారి జాబితాలో రోహిత్‌(43).. వార్నర్‌(49), సచిన్‌(45) తర్వాత స్థానంలో నిలిచాడు. ఇంగ్లండ్‌పై ఓపెనర్‌గా అత్యధిక సెంచరీలు బాదిన భారత క్రికెటర్‌గా సునీల్‌ గావస్కర్‌ సరసన రోహిత్‌(4) చేరాడు. 2021 నుంచి ఎక్కువ టెస్టు సెంచరీలు సాధించిన భారత క్రికెటర్‌ రోహితే. హిట్‌మ్యాన్‌ 6 సెంచరీలు చేయగా.. ఆ తర్వాత గిల్‌(4) ఉన్నాడు.
 
అలాగే, భారత క్రికెట్ జట్టు తరపున 2011 నుంచి అత్యధిక టెస్ట్ సెంచరీలు చేసిన వారిలో రోహిత్ శర్మ ఆరు సెంచరీలతో మొదటి స్థానంలో నిలిచాడు. ఆ తర్వాత గిల్ నాలుగు, రవీంద్ర జడేజా మూడు, యశ్వస్వి జైస్వాల్ మూడు, రిషబ్ పంత్ మూడు, కేఎల్ రాహుల్ మూడు చొప్పున సెంచరీలు చేశాడు. ఇంగ్లండ్‌ జట్టుపై అత్యధిక సెంచరీలు చేసిన భారత ఓపెనర్లలో సునీల్ గవాస్కర్ నాలుగు సెంచరీలు చేసి మొదటి స్థానంలో ఉండగా, ఇపుడు ఈ స్థానాన్ని రోహిత్ శర్మ సమం చేశాడు. విజయ్ మర్చంట్, విజయ్ మురళీ, కేఎల్ రాహుల్‌లు మూడేసి సెంచరీలు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాజకీయాల్లోకి మహ్మద్ షమీ... బెంగాల్ నుంచి బీజేపీ తరపున పోటీ...