పాకిస్థాన్ దేశంలో క్రికెట్ టూర్‌కు వెళ్లాలంటే ఇతర దేశాలు భయంతో వణికిపోతున్నాయి. అలాంటి దేశాల్లో తొలుత భారత్ ఉంది. అయితే, ఇటీవలి కాలంలో పాక్‌లో పరిస్థితులు మెరుగుపడ్డాయని భావించి పలు దేశాలు పాకిస్థాన్‌లో క్రికెట్ ఆడేందుకు మొగ్గు చూపుతున్నాయి. కానీ, అక్కడకు వెళ్లిన తర్వాతగానీ ఆ దేశాలకు అసలు వాస్తవం తెలియరావడంలేదు.
ఇటీవల క్రికెట్ సిరీస్ ఆడేందుకు పాక్ గడ్డపై అడుగుపెట్టిన న్యూజిలాండ్ మ్యాచ్‌కు కొన్ని గంటల ముందు టూర్‌ను రద్దు చేసుకుని స్వదేశానికి వెళ్లిపోయాయి. ఇపుడు ఇంగ్లండ్ వంతు వచ్చింది. పాకిస్థాన్‌లో పర్యటన నుంచి ఇంగ్లండ్ పురుషుల, మహిళల క్రికెట్ జట్లు వెనక్కు తగ్గాయి.
పాకిస్థాన్‌లో భద్రతా సమస్యలు ఉన్నాయని పేర్కొంటూ తమ జట్లను పంపలేమని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డ్ (ఈసీబీ) సోమవారం ప్రకటించింది. తమ ఆటగాళ్ల భౌతిక, మానసిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. న్యూజిలాండ్ నిర్ణయం తీసుకున్న మూడు రోజులకే ఇంగ్లండ్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
కాగా, అక్టోబర్ 13, 14 తేదీల్లో రెండు టీ-20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడేందుకు ఈసీబీతో పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఒప్పందం కుదుర్చుకుంది. అదే నెల 17-21 మధ్య మహిళా జట్లు మూడు వన్‌డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) నిర్ణయం తమను నిరాశ పరిచిందని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ రమీజ్ రాజా ట్వీట్ చేశారు.