భారత్‌లో కరోనా వైరస్ మూడో దశ వ్యాప్తి తప్పదంటూ వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదేసమయంలో ఒక్క దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా డెల్టా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక ప్రకటన చేసింది.
తాజాగా ఆ సంస్థ చీఫ్ టెడ్రోస్ అథనమ్ గెబ్రియాసిస్ మీడియాతో మాట్లాడుతూ, ధనిక దేశాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ సజావుగానే కొనసాగుతోందని కానీ పేద దేశాలకు మాత్రం టీకాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
కరోనాతో ముప్పు లేని యువతకు కూడా ధనిక దేశాలు వ్యాక్సిన్లు అందిస్తుండగా పేద దేశాల్లో రిస్క్ ఉన్న వారికి కూడా అందడం లేవన్నారు. దీంతో ఆఫ్రికాలో పరిస్థితి దారుణంగా ఉందని అన్నారు. వారం రోజుల క్రితం ఉన్న పరిస్థితులతో పోల్చి చూస్తే ప్రస్తుతం ఇన్‌ఫెక్షన్లు, మరణాలు 40 శాతం పెరిగాయని ఆయన తెలిపారు.
అదేసమయంలో డెల్టా వేరియంట్ వైరస్ ప్రపంచ వ్యాప్తంగా వేగంగా వ్యాప్తి చెందుతోందని తెలిపారు. ఇలాంటి తరుణంలో వ్యాక్సిన్ల సరఫరా సమస్యగా మారిందని ఆయన చెప్పారు. ఆఫ్రికా దేశాలకు వ్యాక్సిన్లు పంపాలని ఆయన కోరారు. వ్యాక్సిన్ల విషయంలో వివక్ష కొనసాగుతోందని తెలిపారు.
కాగా, ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్లు అందించాలన్న ఉద్దేశంతో డబ్ల్యూహెచ్‌వో ప్రారంభించిన కోవాక్స్ కార్యక్రమానికి టీకాల సరఫరాలో జాప్యం జరుగుతోంది. కరోనా విజృంభణ నేపథ్యంలో భారత్ వ్యాక్సిన్ల ఎగుమతిని నిలిపివేసిన విషయం తెలిసిందే. దీంతో సీరం నుంచి డబ్ల్యూహెచ్‌వోకు అందాల్సిన వ్యాక్సిన్లు పెద్ద మొత్తంలో నిలిచిపోయాయి.