కన్నడ సీనియర్ నటుడు హల్వానా గంగాధరయ్య(70) కరోనాతో కన్నుమూశారు. కరోనాతో చివరి వరకు పోరాడిన ఆయన శనివారం రాత్రి బెంగళూరులోని బీజీఎస్ ప్రైవేటు ఆసుపత్రిలో ప్రాణాలు కోల్పోయారు. శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది కావడంతో ఆస్పత్రిలో చేరిన ఆయనకు కోవిడ్ అని నిర్ధారణ కావడంతో.. వైద్యులు ఆయనకు చికిత్స అందించారు. కానీ చికిత్స ఫలించక ఆయన కన్నుమూశారు.
స్టేజ్ ఆర్టిస్ట్ నుంచి గొప్ప నటుడిగా పేరు సంపాదించుకున్న గంగాధరయ్య "కర్ణాటక నాటక అకాడమీ" అవార్డు సైతం అందుకున్నారు. సుమారు 120 సినిమాలు, 1500కు పైగా షోల్లో కనిపించారు. నీర్ దోసె, కురిగాలు సర్ కురిగాలు, శబ్దదేవి సినిమాలు ఆయనకు మంచి పేరును సంపాదించి పెట్టాయి. తన స్నేహితుడి మరణం తనను వేధిస్తుందని.. దర్శక రచయిత ఎన్ సీతారామ్ ఆయన మృతి పట్ల సంతాపం తెలిపారు.
ఏడెనిమిది రోజుల క్రితం అతడిని ఆఖరిసారిగా చూశానని ఫేస్‌బుక్‌లో రాసుకొచ్చారు. ఆస్తోపలో అతను నటించిన డ్రైవర్ పాత్ర గంగాధరయ్యకు పాపులారిటీ తెచ్చిపెట్టిందని.. సినిమా విజయానికి దోహదం చేసిందని సీతారామ్ గుర్తు చేసుకున్నారు.
ముక్త ముక్త సీరియల్‌లో ముఖ్యమంత్రి రాజానంద స్వామిగా అతను పోషించిన పాత్ర అందరి మన్ననలను అందుకుంది. తనకు సంబంధించిన 127 స్టేజీ షోలలో పాల్గొనడమే కాక సీరియల్స్‌లో మూడున్నరేళ్లు ఆయన ప్రస్థానం కొనసాగింది. ఆ తర్వాతే వ్యవసాయమే ఆయన ఊపిరిగా మారిందని చెప్పుకొచ్చారు.