బ్లాక్ ఫంగస్ (మ్యూకోర్‌మైకోసిస్) దేశ ప్రజలను వణికిస్తోంది. ప్రాణాంతక ఫంగస్ సోకి రోగులు కంటిని చూపును కోల్పోగా.. మరికొందరు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 8,848 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు అయినట్లు కేంద్ర మంత్రి సదానంద గౌడ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.
ఈ రోగులకు 23 వేల అంఫోటెరిసిన్-బీ వ్యాక్సిన్ వయల్స్‌ను ఆయా రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు పంపామని తెలిపారు. గుజరాత్‌లో అత్యధికంగా 2,281 కేసులు నమోదు కావడంతో ఆ రాష్ట్రానికి 5,800 వయల్స్ పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు.
మహారాష్ట్రకు 5,090 వయల్స్, ఆంధ్రప్రదేశ్‌కు 2,300 వయల్స్, తెలంగాణకు 890 వయల్స్ కేటాయించామన్నారు. ఏపీలో 910, తెలంగాణలో 350 కేసులు నమోదు కాగా, ఢిల్లీలో 197 కేసులు నమోదు అయ్యాయి. ఢిల్లీకి 670 వయల్స్ పంపామన్నారు.
బ్లాక్ ఫంగస్ చికిత్సకు వినియోగించే అంఫోటెరిసిన్-బీ వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేసేందుకు మరో కొత్తగా ఐదు ఫార్మా కంపెనీలకు అనుమతి లభించిందని, మూడు రోజుల్లో అన్ని రకాల అనుమతులు మంజూరు చేయనున్నట్లు నిన్న కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే.
రాబోయే రోజుల్లో వ్యాక్సిన్ కొరత తీరుతుందని తెలిపింది. ప్రస్తుతం ఉన్న ఫార్మా కంపెనీలు ఇప్పటికే ఉత్పత్తిని పెంచడం ప్రారంభించాయని పేర్కొంది.
మరోవైపు అంఫోటెరిసిన్-బీ ఆరు లక్షల ఇంజక్షన్ల దిగుమతికి భారతీయ కంపెనీలు ఆర్డర్ ఇచ్చినట్లు తెలిపింది. పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రభుత్వం ఉన్న ఎలాంటి అవకాశాలను వదిలిపెట్టడం లేదని స్పష్టం చేసింది.