కరోనా దెబ్బకి భారతదేశం విలవిల్లాడిపోతోంది. చిన్న, పెద్ద, ధనిక, పేద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని పట్టిపీడిస్తోంది. ప్రజలతో పాటు ప్రజా ప్రతినిధులు కూడా కరోనా సోకింది. తాజాగా జార్ఖండ్ రాష్ట్ర మంత్రి మిథిలేష్ ఠాకూర్‌కు మంగళవారం నాడు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. అయితే ఇటీవలే ఆ మంత్రి సీఎంతో సమావేశం జరిగిన నేపథ్యంలో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కూడా స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు.
అయితే ముఖ్యమంత్రికి ఎలాంటి లక్షణాలు లేకపోయినప్పటికీ ఆయన హోం క్వారంటైన్‌లోకి వెళ్ళినట్లు అధికారులు తెలియజేశారు. సీఎంతో పాటు ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు, కార్యాలయంలోని సిబ్బందిని హోం క్వారంటైన్ లోనే ఉండాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. అలాగే సీఎం కార్యాలయంలోకి వచ్చే విజిటర్స్ పై కూడా అనేక నిబంధనలను ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే జార్ఖండ్ రాష్ట్రంలో ఇప్పటివరకు 3056 కేసులు పాజిటివ్‌గా నమోదవగా అందులో 22 మంది ప్రాణాలు కోల్పోయారు.