జార్ఖండ్ పోలీసులకు కరోనా చుక్కలు చూపిస్తోంది. జార్ఖండ్‌లో ఇటీవల అరెస్టయిన ఇద్దరు నిందితుల్లో ఒకరికి కరోనా పాజిటివ్ అని తేలడంతో... పోలీసులు క్వారంటైన్‌కు వెళ్లాల్సి వచ్చింది. ఈ క్రమంలో నిందితుడిని అదుపులోకి తీసుకోవడానికి వెళ్లిన డీఎస్పీ సహా 42 మంది పోలీసుల్ని క్వారంటైన్‌కు తరలించారు.
వివరాల్లోకి వెళితే.. కొడెర్మా జిల్లాలోని చుటియారో గ్రామంలో అక్రమంగా మద్యం తయారు చేస్తున్న ఓ యూనిట్‌పై పోలీసులు దాడి చేశారు. అక్కడ ఇద్దరు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు.
కరోనా నిబంధనల ప్రకారం.. జైలుకు తరలించడానికి ముందు వారికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. ఒకరికి పాజిటివ్ తేలింది. దీంతో వెంటనే అతణ్ని ఆస్పత్రికి తరలించారు. మరొకరిని జైలుకు పంపారు. అలాగే రైడ్‌కు వెళ్లిన 42 మంది పోలీసుల్ని క్వారంటైన్ కేంద్రానికి తరలించారు.
నిందితుడు ఉన్న జైలు పరిసరాలు సహా చుటియారో గ్రామాన్ని పూర్తిగా క్రిమిసంహారక మందులతో శుభ్రపరిచారు. మద్యం తయారీ కేంద్రం ఉన్న ప్రాంతాన్ని కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటించారు. అతణ్ని ఈ మధ్య కలిసిన వారందరినీ గుర్తించి పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు.