Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కరోనా పంజా : దేశవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌ - 15 షరతులు...

కరోనా పంజా : దేశవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌ - 15 షరతులు...
, బుధవారం, 18 మార్చి 2020 (09:05 IST)
కరోనా ఉద్ధృతి నేపథ్యంలో మార్చి 31వరకు దేశంలో పాఠశాలలు, విశ్వవిద్యాలయాలతో సహా అన్ని విద్యాసంస్థలను మూసివేయాలని కేంద్ర వైద్యారోగ్యశాఖ సోమవారం రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు (అడ్వయిజరీ) జారీ చేసింది. అన్ని థియేటర్లు, వ్యాయామశాలలు, మ్యూజియంలు, సాంస్కృతిక, సామాజిక కేంద్రాలు, ఈత కొలనులు మూసేయాలని నిర్దేశించింది. 
 
విద్యార్థులంతా ఇళ్లకే పరిమితం కావాలని, రాష్ట్ర ప్రభుత్వాలు ఆన్‌లైన్‌ విద్యను ప్రోత్సహించాలని సూచించింది. సామాజికంగా ఒకరికొకరు దూరంగా ఉండడమే కొవిడ్‌-19 వైరస్‌ వ్యాప్తి నివారణకు మంచి మార్గమని పేర్కొంటూ కేంద్ర వైద్యారోగ్యశాఖ 15 నిబంధనలను విధించింది. ఇందుకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా ఏవైనా చర్యలు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చని సూచించింది. మార్చి 31 తర్వాత అప్పటి పరిస్థితులను బట్టి వీటిని సమీక్షిస్తామని పేర్కొంది. కేంద్రం 15 షరతులు నిర్దేశించింది.
 
కేంద్రం నిర్దేశించిన 15 షరతులివీ..
1 అన్ని విద్యాసంస్థలను మూసివేయాలి. 
 
2 సమావేశాలు సాధ్యమైనంత మేరకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించాలి. అత్యవసరమైతే తప్ప ఎక్కువమంది గుమిగూడే సమావేశాలు పెట్టుకోరాదు. అందులో పాల్గొనేవారి సంఖ్యను సాధ్యమైనంతమేర తగ్గించాలి.
 
3 అన్ని రెస్టారెంట్లలో చేతులు శుభ్రం చేసుకొనే ప్రొటోకాల్‌ అమలుచేయాలి. వినియోగదారులు తాకేందుకు వీలున్న టేబుళ్లు, కుర్చీలు, స్థలాలను నిరంతరం శుభ్రపరుస్తూ ఉండాలి. ప్రతి టేబుల్‌కి మధ్య కనీసం మీటర్‌ దూరం ఉండేలా చూడాలి. వీలైతే ఆరుబయట సీటింగ్‌ ఏర్పాట్లు చేసి సాధ్యమైనంత దూరం ఉంచాలి.
 
4 తప్పనిసరిగా పరిశుభ్రత, భౌతిక దూరం పాటించాలి. కరచాలనం, కౌగిలించుకోవడం వంటి సంప్రదాయాలకు దూరంగా ఉండాలి.
 
5 ఆన్‌లైన్‌ వస్తువులను డెలివరీ చేసే వారికి తగిన రక్షణ ఏర్పాట్లు చేయాలి.
 
6 సమాజానికి నిరంతరంగా సమాచారాన్ని అందించాలి.
 
7 పరీక్షలు వాయిదా వేయడానికి ప్రయత్నించాలి. విద్యార్థుల మధ్య కనీసం మీటర్‌ దూరం పాటించగలిగితేనే ప్రస్తుతం జరుగుతున్న పరీక్షలను కొనసాగించాలి.
 
8 మతపరమైన కార్యకలాపాలు, సభల్లో పెద్దఎత్తున ప్రజలు గుమిగూడకుండా స్థానిక అధికారులు.. నాయకులు, మతపెద్దలతో మాట్లాడి నచ్చజెప్పాలి. విధిలేని పరిస్థితి ఉంటే ప్రతి ఒక్కరి మధ్య కనీసం ఒక మీటరు దూరం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. 
 
9 పనివేళల విషయంలో అధికారులు వాణిజ్య సంఘాలు, ఇతర భాగస్వామ్యపక్షాలతో అధికారులు మాట్లాడాలి. ప్రజలకు అత్యవసరమైన కూరగాయల మార్కెట్లు, పండ్ల మార్కెట్లు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, పోస్టాఫీసులు లాంటిచోట్ల  ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను బహిరంగంగా ప్రదర్శించాలి.
 
10 వీలైనచోటల్లా ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేసే వీలు కల్పించేలా ప్రైవేటు సంస్థలను ప్రోత్సహించాలి.
 
11 ఇప్పటికే నిర్ణయించిన పెళ్లిళ్లలో పరిమితంగా జనం ఉండేలా చూసుకోవాలి. అనవసరమైన సామాజిక, సాంస్కృతిక సమావేశాలు వాయిదా వేసుకోవాలి.
 
12 క్రీడా కార్యక్రమాలు, పోటీలను వాయిదా వేసుకొనేలా స్థానిక అధికారులు వాటి నిర్వాహకులకు నచ్చజెప్పాలి.
 
13 వ్యాపార సంస్థలు తమదగ్గరకు వచ్చే వినియోగదారుల మధ్య మీటరు దూరం ఉండేలా చేయాలి. రద్దీ వేళల్లో ఎక్కువ మంది గుమిగూడకుండా చూడాలి.
 
14 కోవిడ్‌-19 విషయంలో ఆసుపత్రులు ప్రొటోకాల్‌ అనుసరించాలి. ఆసుపత్రిలో రోగులను చూసేందుకు కుటుంబీకులు, పిల్లలను అనుమతించరాదు.
 
15 అనవసరమైన ప్రయాణాలు రద్దుచేసుకోవాలి. అన్ని సాధనాలనూ తగిన విధంగా శుభ్రం చేయాలి.
 
ప్రయాణ సలహా..
యూఏఈ, ఖతార్‌, ఒమన్‌, కువైట్‌ నుంచి వచ్చే ప్రయాణికులు 14 రోజుల క్వారంటైన్‌లో ఉండాలి. ఇది 18న అర్థరాత్రి నుంచి అమల్లోకి వస్తుంది.
 
ఈ నెల 18 నుంచి ఐరోపా సమాఖ్య, ఐరోపా స్వేచ్ఛా వాణిజ్య సంఘం దేశాలు, టర్కీ, బ్రిటన్‌ నుంచి వచ్చే వారిపై (భారతీయులు సహా) పూర్తి నిషేధం విధింపు. ఈ దేశాలకు చెందిన ప్రయాణికులకు విమానాలు (కనెక్టెడ్‌ ఫ్లైట్స్‌) అవకాశం కల్పించకూడదు. ఈ నిర్ణయాలు మార్చి 31 వరకు అమల్లో ఉంటాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా రోగిపై అసత్య ప్రచారం : భువనగిరిలో ముగ్గురి అరెస్టు