భారత్ బయోటెక్ సంస్థకు చెందిన కోవాగ్జిన్ టీకా వేసుకున్న వాళ్లు తమ దేశానికి రావచ్చు అంటూ ఆస్ట్రేలియా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కోవాగ్జిన్‌కు ఇంకా ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి గ్రీన్‌సిగ్నల్ రాకున్నా.. వేలాది మంది ప్రయాణికులకు ఊరటనిచ్చే విషయాన్ని ఆస్ట్రేలియా వెల్లడించింది.
దాదాపు 600 రోజుల తర్వాత మళ్లీ అంతర్జాతీయ ప్రయాణికులకు ఆస్ట్రేలియా ఓకే చెప్పింది. దీంతో సోమవారం నుంచి ఆ దేశంలో అంతర్జాతీయ ప్రయాణికుల తాకిడి మళ్లీ మొదలైంది. ప్రయాణికుల వ్యాక్సినేషన్ స్టాటస్ విషయంలో కోవాగ్జిన్‌కు గుర్తింపు ఇస్తునట్లు ఆస్ట్రేలియా ప్రభుత్వం వెల్లడించింది. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా హై కమిషనర్ బారీ ఓ ఫారెల్ ఏవో వెల్లడించారు.
దీంతో 20 నెలల విరామం తర్వాత అంతర్జాతీయ సరిహద్దుల్ని తెరవడంతో సిడ్నీ విమానాశ్రయంలో ఇవాళ భావోద్వేగ దృశ్యాలు కనిపించాయి. అనేక మంది ప్రయాణికులు చాలా గ్యాప్ తర్వాత తమ ఆత్మీయులను కలుసుకున్నారు. ఈ సందర్భంలో కొందరు కంటనీరు పెట్టారు. కొందరు ఆనందంతో గంతులేశారు.
కోవాగ్జిన్, సైనోఫార్మ్‌లకు అనుమతి దక్కిన నేపథ్యంలో ఇక ఆస్ట్రేలియాలో 14 రోజుల హోటల్ క్వారెంటైన్ అవసరం ఉండదని అధికారులు వెల్లడించారు. అయితే రెండో డోసులు తీసుకోని వారు మాత్రం క్వారెంటైన్‌లో ఉండాల్సి ఉంటుంది. 12 ఏళ్లు దాటిన వారు ఎవరైనా కోవాగ్జిన్ తీసుకుంటే వారికి బోర్డర్ ఫోర్స్ అనుమతి ఇవ్వనున్నట్లు ఆస్ట్రేలియా చెప్పింది.