హైదరాబాద్: టెలికాం రంగంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న రిలయన్స్ జియో తెలుగు రాష్ట్రాల్లో మరింత వేగంగా దూసుకుపోతోంది. గడచిన ఏప్రిల్ నెలలో ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్(తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిపి)లో రిలయన్స్ జియో కొత్తగా 6 లక్షల మంది వినియోగదారులను చేర్చుకుంది.
జియో మినహా ఇతర ఆపరేటర్ల (ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్, టాటా టెలీ) వినియోగదారుల సంఖ్య గణనీయంగా పడిపోవటం గమనార్హం. తాజా పెరుగుదలతో ఏప్రిల్ చివరి నాటికి తెలుగు రాష్ట్రాల్లో జియో వినియోగదారుల సంఖ్య దాదాపు 2.5 కోట్లకి చేరుకుంది. 2019 ఏప్రిల్ కాలానికి టెలికాం అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) విడుదల చేసిన తాజా నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
దేశ వ్యాప్తంగా మొత్తం టెలికాం వినియోదారుల సంఖ్య ఏప్రిల్ చివరి నాటికి 118.37 కోట్లకి చేరుకుంది. జియోతో పాటు బీఎస్ఎన్ఎల్ మాత్రమే ఈ నెలలో సుమారు 83 లక్షల మంది వినియోగదారులను దేశవ్యాప్తంగా జోడించాయి.