దేశంలో వంట నూనెల ధరలు ఒక్కసారి భారీగా పెరిగిపోయాయి. ముడి పామాయిల్(సీపీఓ) ధరలు గత నెలలో 15 శాతం వరకు పెరిగాయి. మలేషియా నుంచి దిగుమతయ్యే రిఫైన్డ్ పామాయిల్‌పై ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో, క్రూడ్ పామాయిల్ ధరలు పైకిఎగిశాయి.
మల్టి కమోడిటీ ఎక్స్చేంజ్(ఎంసీఎక్స్)లో ట్రేడయ్యే జనవరి ఎక్స్‌పైరీ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ సీపీఓ ధర 10 కేజీలకు రూ.839.80కు పెరిగింది. నెల క్రితం ఎంసీఎక్స్‌లో సీపీఓ ధర 10 కేజీలకు రూ.731.40గా ఉండేది. అంటే ఒక్క నెలలోనే 15 శాతానికి పైగా ధరలు పెరిగాయి.
కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖలో అందుబాటులో ఉన్న రిటైల్ ధరల ప్రకారం, ఢిల్లీలో ఆవ నూనె ధర గత నెల రోజుల్లో కేజీకి రూ.12 పెరిగింది. 2019 డిసెంబర్ 10న కేజీ ఆవ నూనె ధర రూ.124 ఉంటే, ఈ నెల 10 నాటికి రూ.136కు పెరిగింది.
ఇదేసమయంలో పామాయిల్ ధర గత నెల రూ.91 ఉంటే, ఇప్పుడు రూ.105 పలుకుతోంది. సోయా ఆయిల్ కూడా కేజీకి రూ.106 నుంచి రూ.122కు పెరిగింది. రిఫైన్డ్ పామాయిల్ ధర గుజరాత్‌లోని కాండ్లా ప్లాంట్‌లో 10 కేజీలకు రూ.890గా ఉంది.
గతేడాది డిసెంబర్‌లో ఈ ధర రూ.810గా ఉండేది. సూర్యముఖి రిఫైన్డ్ ధర కూడా 10 కేజీలకు రూ.860 నుంచి రూ.960 పెరిగింది. గత నెల రోజుల కాలంలో మలేషియాలో రిఫైన్డ్ పామాయిల్ పామోలిన్ ధర టన్నుకు 710 డాలర్ల నుంచి 800 డాలర్లకు పెరిగింది.
అర్జెంటీనా నుంచి దిగుమతి చేసుకునే సోయా ఆయిల్ ధర టన్నుకు 741.25 డాలర్ల నుంచి 823 డాలర్లకు ఎగిసింది. ఈ నేపథ్యంలో మలేషియా నుంచి దిగుమతి చేసుకునే రిఫైన్డ్ పామాయిల్‌ను కేంద్ర ప్రభుత్వం రిస్ట్రిక్టెడ్ కేటగిరీలో పెట్టింది. అదేవిధంగా క్రూడ్ పామాయిల్ దిగుమతులను మాత్రం కొనసాగిస్తామని తెలిపింది.