Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 6 April 2025
webdunia

లాయర్ దంపతుల హత్య కేసు: ఏ1 కుంటా శ్రీనును మహారాష్ట్ర సరిహద్దులో పట్టుకున్నాం- ఐజీ నాగిరెడ్డి

Advertiesment
Lawyer Vamana Rao
, గురువారం, 18 ఫిబ్రవరి 2021 (22:06 IST)
తెలంగాణ హైకోర్టు న్యాయవాది వామన్ రావు, ఆయన భార్య నాగమణిల హత్య కేసులో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశామని కరీంనగర్ ఐజీ నాగిరెడ్డి తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఆయన మీడియాకు వివరించారు.

 
ఈ కేసులో ఇవాళ (గురువారం) ఉదయం కుంటా శ్రీను, చిరంజీవిని అదుపులోకి తీసుకున్నామని, వారిని శుక్రవారం కోర్టులో హాజరుపరుస్తామని ఐజీ చెప్పారు. మరికొంతమంది కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని తెలిపారు. హత్యలకు సహకరించిన కుమార్‌ను కూడా అరెస్టు చేశామన్నారు.

 
ఏ1. కుంట శ్రీనివాస్, ఏ2. శివందుల చిరంజీవి, ఏ3. అక్కపాక కుమార్ అని చెప్పారు. నిందితులను కస్టడీకి తీసుకొని సాంకేతిక సాక్ష్యాలు, డిజిటల్ అండ్ సోషల్ మీడియా సాక్ష్యాలు, ఇతర సాక్ష్యాల ద్వారా కేసును దర్యాప్తు చేస్తామని, ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గాని ఎవరి ప్రమేయం ఉన్నా, వారు ఎంతటివారినైనా వదలిపెట్టబోమని ఐజీ అన్నారు.

 
వామన్‌రావు స్వగ్రామంలో గుంజపడుగులో కుంటా శ్రీను ఇల్లు నిర్మాణం విషయంలో వివాదం ఉందని, రామాలయం కమిటీ విషయంలోనూ వివాదం నడుస్తోందని ఐజీ వివరించారు. "ఆలయం కమిటీ వివాదానికి సంబంధించి హైకోర్టులో రిట్ పిటిషన్ వేసేందుకు బుధవారం మంథని కోర్టుకు వచ్చిన వామన్‌రావు తన తండ్రి, తమ్ముడి సంతకాలు తీసుకున్నారు. అనంతరం వామన్ రావు హైదరాబాద్ వెళ్తుండగా హత్య జరిగింది. పథకం ప్రకారమే ఈ జంట హత్యలు జరిగాయి. ముందుగా నాగమణిపై కత్తులతో దాడి చేశారు, తర్వాత వామన్‌రావుపై దాడి చేశారు. నిందితుల కారును చిరంజీవి అనే వ్యక్తి నడిపాడు" అని ఐజీ చెప్పారు.

 
హత్యకు ఉపయోగించిన నలుపు రంగు కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నామన్నారు. వామన్‌రావు ప్రాణభయం ఉందని తమకు చెప్పలేదని ఐజీ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఇంకా పూర్తి దర్యాప్తు చేయాల్సి ఉందన్నారు.

 
కుంట శ్రీను నేరచరిత్ర
కుంటా శ్రీనుకు నేరచరిత్ర ఉన్నదని పోలీసులు చెప్పారు. 1997లో అతడు సికాసలో చాలా ప్రభావశీలమైన సభ్యుడిగా ఉన్నాడని, బస్సు తగలబెట్టిన కేసులో రిమాండ్‌కు వెళ్ళాడని, తర్వాత పోలీసుల ఎదుట లొంగిపోయి రాజకీయాల్లోకి వచ్చాడని తెలిపారు.

 
వామన్ రావు దంపతుల అంత్యక్రియలు పూర్తి
తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో బుధవారం హత్యకు గురైన న్యాయవాది గట్టు వామన్ రావు, ఆయన భార్య నాగమణి అంత్యక్రియలు వారి స్వగ్రామం గుంజపడుగులో పూర్తయ్యాయి. మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు సహా పలువురు నేతలు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.

 
ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని తెలంగాణ కాంగ్రెస్ నేత ఉత్తమ్‌కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇందుకోసం తాము హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేస్తామని, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కి లేఖ రాస్తామన్నారు. న్యాయవాదులకు రక్షణ కల్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసు అధికారులను సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రియురాలిని గర్భవతిని చేసి.. ఆమె తల్లితో లేచిపోయాడు..