Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చంద్రయాన్-3: విక్రమ్, ప్రజ్ఞాన్ రోవర్ పని చేసేది 14 రోజులేనా, తర్వాత ఇవి ఏమవుతాయి?

Advertiesment
chandrayaan-3
, శనివారం, 26 ఆగస్టు 2023 (11:56 IST)
చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చంద్రయాన్-3లో భాగంగా దించిన విక్రమ్, ప్రజ్ఞాన్‌లలో ఆరు రకాల పరికరాలు అమర్చి ఉన్నాయి. చంద్రుడిపై భిన్నమైన పరిశోధనలు చేస్తూ సరికొత్త సమాచారాన్ని సేకరించడమే వీటి పని. కానీ, వీటి పని కేవలం వచ్చే 14 రోజులు మాత్రమే జరుగుతుంది. ఎందుకంటే, వీటి జీవిత కాలం ఇంతే. విక్రమ్, ప్రజ్ఞాన్ రోవర్‌ల మిషన్ జీవిత కాలం కేవలం 14 రోజులు మాత్రమేనని ఇస్రో తన వెబ్‌సైట్‌లో వెల్లడించింది. కానీ, ఎందుకిలా? ఆ తర్వాత వీటి పరిస్థితేంటి? వంటి విషయాలను మనం ఇక్కడ చూద్దాం..
 
విక్రమ్, ప్రజ్ఞాన్ రోవర్‌ల జీవితకాలం కేవలం 14 రోజులేనా?
విక్రమ్, ప్రజ్ఞాన్ రోవర్‌లు సోలార్ ఎనర్జీ ఆధారంగా పనిచేయడమే.. వీటి జీవిత కాలం 14 రోజులుండేందుకు కారణం. సూర్యరశ్మిని ఎనర్జీగా మార్చుకోవడం ద్వారా ఈ రెండూ పనిచేస్తుంటాయి. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌ల ఫొటోలను కనుక మీరు చూసుంటే, వాటిపై అమర్చిన సోలార్ ప్యానల్స్‌పైకి మీ దృష్టి మరలేది. విక్రమ్ ల్యాండర్‌కు మూడు వైపులా సోలార్ ప్యానల్స్ ఉన్నాయి. వీటితో ఎలాంటి పరిస్థితిలోనైనా అవసరమైనంత వెలుతురును ఇది పొందగలదు. కానీ, ఇది కేవలం వచ్చే 14 రోజులు మాత్రమే. ఎందుకంటే, 14 రోజుల తర్వాత చంద్రుడిపైన విక్రమ్ ల్యాండర్ దిగిన ప్రాంతమంతా చీకటి పడనుంది. చంద్రుడిపైన ఒక రోజు భూమిపై 14 రోజులతో సమానం.
 
చంద్రుడిపై ఆగస్ట్ 23న సూర్యోదయం అయింది. ఈ పగటిపూట వాతావరణం అక్కడ సెప్టెంబర్ 5 నుంచి 6వ తారీఖు వరకు ఉండనుంది. ఆ తర్వాత చంద్రుడిపై ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతాయి. భూమిపై ఉన్న వాతావరణం చంద్రుడిపై ఉండదు. రాత్రిపూట కూడా భూమిపై వేడిగా ఉంటుంది. చంద్రుడిపై సూర్యోదయం, సూర్యాస్తమయం సమయాల్లో ఉష్ణోగ్రతల్లో భారీ మార్పులుంటాయి. ‘‘సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు ప్రతీది కూడా అంధకారంలోకి వెళ్తుంది. ఉష్ణోగ్రతలు మైనస్ 180 డిగ్రీ సెల్సియస్‌కి పడిపోతాయి. ఆ ఉష్ణోగ్రతల్లో ఈ సిస్టమ్స్‌ను సురక్షితంగా ఉంచడం సాధ్యం కాదు’’ అని ఇస్రో చీఫ్ డాక్టర్ సోమనాథ్ అన్నారు.
 
ఈ ఉష్ణోగ్రతలను ఇవి తట్టుకోగలవా?
14 రోజుల అంధకారం తర్వాత చంద్రుడిపై మళ్లీ సూర్యోదయమవుతుంది. పడిపోయిన ఉష్ణోగ్రతలు కూడా మెరుగవుతాయి. కానీ, ఈ సూర్యరశ్మి విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లకు మళ్లీ సరికొత్త జీవితాన్ని అందించగలదా? అనే ప్రశ్నలు సైతం ఉత్పన్నమవుతున్నాయి. చంద్రుడిపై పడిపోయే ఉష్ణోగ్రతలను ఈ సిస్టమ్స్ తట్టుకుని నిలదొక్కుకునే అవకాశం చాలా కష్టమని ఇస్రో చీఫ్ డాక్టర్ సోమనాథ్ అన్నారు. ‘‘ఒకవేళ ఈ సిస్టమ్స్‌ సురక్షితంగా ఉంటే మాకు చాలా సంతోషం. ఒకవేళ ఇవి మళ్లీ యాక్టివ్ అయితే, వాటితో మేం మళ్లీ పనిచేస్తాం. ఇది జరగాలని మేం ఆశిస్తున్నాం’’ అని సోమనాథ్ అన్నారు.
 
కానీ, చంద్రుడిపైన సూర్యోదయమైన తర్వాత కూడా విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లు పనిచేయకపోతే ఏం జరుగుతుంది? అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. చంద్రయాన్-3 గురించి ఇంటర్నెట్‌లో సమాచారాన్ని వెతుకుతున్న ప్రజలు, చంద్రుడిపై చీకటి పడిన తర్వాత విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లు మళ్లీ భూమిపైకి వస్తాయా? అని ప్రశ్నిస్తున్నారు. అంతేకాక, చంద్రుడి నమూనాలను వాటితో తీసుకొస్తాయా? అంటూ ప్రశ్నిస్తున్నారు. కానీ, ఇలా జరగదు. అందుకే దీనికి సమాధానం ‘నో’. ఎంతో కాలంగా సైన్స్‌కు సంబంధించిన విషయాలపై విస్తృతంగా కవర్ చేసిన సీనియర్ జర్నలిస్ట్ పల్లవ్ బంగ్లా ఈ ప్రశ్నలకు సమాధానాలను సవివరంగా తెలిపారు. ‘‘ఈ మిషన్ చంద్రుడిపై నమూనాలను సేకరించే మిషన్ కాదు. దీనిలో ఉన్న పరికరాలు లేజర్ సాయంతో సమాచారాన్ని సేకరిస్తాయి. ఈ సమాచారాన్ని పరిశీలిస్తారు. చంద్రుడిపైకి మిషన్లను పంపి నమూనాలు సేకరించే టెక్నాలజీ ఇంకా భారత్ వద్ద లేదు’’ అని తెలిపారు.
 
చంద్రుడిపై కౌంట్‌డౌన్ మొదలు
చంద్రుడిపైకి చేరుకున్న విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌ల కౌంట్‌డౌన్ మొదలైంది. ఇంత తక్కువ సమయంలో చంద్రుడి నుంచి ఈ రెండు ఏ సమాచారాన్ని సేకరిస్తాయి. ‘‘చంద్రయాన్-3 చంద్రుడిపైకి చేరుకున్న తర్వాత, నేను ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్‌తో మాట్లాడాను. ఈ 14 రోజులు చంద్రుడిపై నిర్వహించాల్సిన పనిని ఇప్పటికే ప్రారంభించినట్లు ఆయన చెప్పారు. చేరుకున్న స్వల్ప వ్యవధిలోనే ఫొటోలు కూడా వస్తున్నాయన్నారు.’’ అని పల్లవ్ బంగ్లా చెప్పారు. విక్రమ్ ల్యాండర్ తీసిన ఫొటోలను ఇస్రో ప్రజలతో షేర్ చేసుకుంటూనే ఉంది. దీంతో పాటు, చంద్రుడి ఉపరితలంపైకి నెమ్మదిగా వెళ్తున్న ల్యాండర్‌కు చెందిన వీడియోను కూడా ఇస్రో విడుదల చేసింది. ఇది మాత్రమే కాక, విక్రమ్ ల్యాండర్ నుంచి ప్రజ్ఞాన్ రోవర్‌ బయటికి వచ్చిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది.
 
వచ్చే 14 రోజుల్లో ఏం జరుగుతుంది?
ఫొటోలు తీయడమే కాకుండా.. చంద్రుడిపై ఈ పరికరాలు ఇంకేం చేస్తాయి? ఈ 14 రోజుల్లో, ఇప్పటికే రెండు రోజులు గడిచిపోయాయి. ఇంకా 12 రోజులే సమయం ఉంది. గత రెండు రోజుల్లో ఈ పరికరాల టెస్టింగ్ పూర్తయింది. ఇస్రో నుంచి వస్తోన్న అప్‌డేట్ల ప్రకారం, అన్ని సిస్టమ్స్‌ కూడా బాగా పనిచేస్తున్నట్లు తెలిపింది. ‘‘చంద్రుడి ఉపరితలంపైకి చేరుకున్న తర్వాత, అన్ని పరికరాలను పరిశీలించారు. ఇవి సరిగ్గా పనిచేస్తున్నాయా, లేదా? అన్నది చెక్ చేశారు. ఒకదానికొకటి కమ్యూనికేట్ అవుతున్నాయో లేదో చెక్ చేశారు.
 
ఆ తర్వాత శాస్త్రవేత్తల ప్రయోగాలు ప్రారంభమవుతున్నాయి. ఇస్రో వద్ద పెద్దగా సమయం లేకపోవడంతో, విక్రమ్ ల్యాండర్ పని ఇప్పటికే ప్రారంభమైంది. అన్ని సైంటిఫిక్ ప్రయోగాలను కూడా శాస్త్రవేత్తలు 14 రోజుల్లో పూర్తి చేయాలి.’’ అని బంగ్లా వివరించారు. ‘‘ఈ డివైజ్‌లు సోలార్ పవర్‌కి అనుగుణంగా పనిచేస్తాయి. సూర్యాస్తమయం అయితే, ఇవి పనిచేయడం ఆగిపోతాయి. వీటి బ్యాటరీలకు ఎలాంటి జీవితకాలం ఉండదు. అందుకే ఇస్రో వెంటనే దాని పనిని ప్రారంభించింది’’ అని తెలిపారు. చంద్రుడిపైనున్న దక్షిణ ధ్రువం ఎన్నో రహస్యాలతో కూడుకుని ఉందని, ఇక్కడ పనిచేయడం చాలా క్లిష్టతరమని అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసా తెలిపింది.
 
‘‘ఇస్రో విడుదల చేసిన ఫొటోలతో విక్రమ్‌కి చెందిన ఒక కాలు కనిపిస్తోంది. ఇది బాగానే ఉంది. దీని ఇతర కాళ్లు కూడా సురక్షితంగా ఉన్నాయి. వీటికేం కాలేదు. వీటితో పాటు చంద్రుడిపై నేల చాలా చదునుగా కనిపించింది. రోవర్ తన పనిని చక్కగా చేయగలదు, ఇది చాలా సంతోషకరమైన విషయం’’ అని బంగ్లా వివరించారు. ఆరు చక్రాల రోవర్ బరువు కేవలం 26 కేజీలు మాత్రమే. ఇది చాలా నిదానంగా కదులుతుంది.
 
కానీ, చంద్రుడి ఉపరితలంపై నడుస్తూ రాబోయే రెండు వారాల్లో ఈ ప్రజ్ఞాన్ రోవర్‌ ఏం చేస్తుంది?
‘‘చంద్రుడి దక్షిణ ధ్రువంపై ఉన్న నేలపై ప్రజ్ఞాన్ రోవర్ నడుస్తుంది. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏ దేశానికి చెందిన ఎక్విప్‌మెంట్ కూడా ఇలా దక్షిణ ధ్రువంపై నడవలేదు. అది పంపే ప్రతి డేటా కూడా ఎంతో కీలకం, ప్రత్యేకమైంది. ’’ అని బంగ్లా వివరించారు. చంద్రుడి ఉపరితలంపై ఉన్న రసాయన సమ్మేళనం, చంద్రుడి నేలపై ఏ స్థాయిలో మూలకాలున్నాయి అనే విషయాల గురించి ఇది తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. చంద్రుడి మొత్తం జియాలజీ కూడా ఒకే విధంగా ఉండదు. ఇప్పటి వరకు చంద్రుని గురించి మనకు లభించిన సమాచారమంతా ఈక్వెటోరియల్ రీజియన్‌కు చెందినదే. ఇటువంటి పరిస్థితులో, ఏ సమాచారం మనం పొందినా అది కొత్తదే అవుతుంది. లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్‌డౌన్ స్పెక్ట్రోస్కోప్‌ రోవర్‌లో ఉంది.
 
ఇది అత్యాధునిక పరికరం. ఆ ప్రాంతంలో ఉన్న మూలకాలను, వాటి లక్షణాలను ఇది గుర్తిస్తుంది. రోవర్‌లో అమర్చిన ఎల్ఐబీఎస్ పరికరం, చంద్రుడి ఉపరితలంపై ఉన్న మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, పొటాషియం, కాల్షియం, టైటానియం వంటి రసాయన మూలకాలను గుర్తిస్తుంది. రోవర్‌లో మరో పరికరం ఉంది. అది ఆల్ఫా పార్టికల్ ఎక్స్-రే స్పెక్ట్రోమీటర్. ఇది చంద్రుడి ఉపరితలంపై ఉండే మట్టి, రాళ్లలోని అపారమైన రసాయన సమ్మేళనాలను గుర్తిస్తుంది. చంద్రుడి ఉపరితలం, దాని నేలను మరింత అర్థం చేసుకోవడం ద్వారా భవిష్యత్‌లో ప్రయోగాలను వేగంగా చేపట్టేందుకు ఇది ఒక మార్గంగా ఉపయోగపడుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కుక్కలు మనుషులకు ఎలా దగ్గరయ్యాయి? ఒకప్పటి పెంపుడు జంతువులైన తోడేళ్లు ఎందుకు దూరమయ్యాయి?