Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'పాకిస్థాన్ జిందాబాద్' నినాదాలపై అసదుద్దీన్ ఒవైసీ ఏమంటున్నారు?

'పాకిస్థాన్ జిందాబాద్' నినాదాలపై అసదుద్దీన్ ఒవైసీ ఏమంటున్నారు?
, శుక్రవారం, 21 ఫిబ్రవరి 2020 (18:48 IST)
బెంగళూరులో జరిగిన సీఏఏ వ్యతిరేక ర్యాలీలో పాకిస్థాన్ అనుకూల నినాదాలు చేసిన ఒక విద్యార్థినిని బీజేపీ నేతలు జాతి - వ్యతిరేకిగా అభివర్ణించారు. కర్ణాటక బీజేపీ నేతలు దీనిని "పాకిస్థాన్ మద్దతుదారులు దేశంలో అశాంతి సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు" అని చెబుతున్నారు. 
 
ఫ్రీడం పార్కులో నిర్వహించిన సీఏఏ వ్యతిరేక ర్యాలీలో 18 ఏళ్ల విద్యార్థిని అమూల్యా లియోనా నినాదాలు చేయడంతో పోలీసులు స్వయంగా జోక్యం చేసుకున్నారు. అమూల్య చేతి నుంచి మైక్ లాక్కుని, ఆమెపై ఐపీసీ సెక్షన్ 124ఎ కింద దేశద్రోహం కేసు పట్టారు. ఆమె దేశ ప్రజల్లో విద్వేషాలు పెంచడానికి ప్రయత్నించింది అని చెబుతున్నారు.
 
అమూల్యపై దేశద్రోహం కేసు నమోదు చేశామని, ఆమెకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించారని వెస్ట్ డీసీపీ బి.రమేష్ చెప్పారు. ర్యాలీలో అమూల్య మైక్ చేతిలోకి తీసుకోగానే 'పాకిస్థాన్ జిందాబాద్' నినాదాలు చేసింది. అది వినగానే ర్యాలీ నిర్వాహకులు, స్టార్ స్పీకర్ ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ మైక్ లాక్కోడానికి అమూల్య వైపు పరిగెత్తారు. ఆమె నినాదాలు చేస్తున్న సమయంలో ఒవైసీ నమాజు కోసం వెళ్లేందుకు వేదిక నుంచి దిగుతున్నారు.
 
తను పాకిస్థాన్ జిందాబాద్ నినాదాలు ఎందుకు చేసిందో తర్వాత ఆమె స్పష్టం చేసే ప్రయత్నం చేశారు. కానీ, షాక్‌క గురైన ఒవైసీ, కార్యక్రమం నిర్వాహకులు అమూల్య తన మాటలు పూర్తి చేయకుండా అడ్డుకున్నారు. ఆమె చేతి నుంచి మైక్ లాక్కుని పోలీసులు ఆమెను వేదిక మీద నుంచి తీసుకెళ్లడానికి సాయం చేశారు. ఈలోపు నిర్వాహకులు, ఒవైసీ తన దగ్గరకు వచ్చిన తర్వాత కూడా అమూల్య ఉన్న దగ్గరే నిలబడి హిందుస్థాన్ జిందాబాద్ నినాదాలు కూడా చేశారు.
 
వార్తా సంస్థ ఏఎన్ఐ ట్విటర్‌లో పెట్టిన వీడియోలో అమూల్య 'పాకిస్థాన్ జిందాబాద్, హిందుస్థాన్ జిందాబాద్' అని రెండు నినాదాలూ చేయడం స్పష్టంగా కనిపించింది. మైక్ లాక్కున్న తర్వాత కూడా ఆమె తన వైపు నుంచి దానికి వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
webdunia
 
అమూల్య బెంగళూరులోని ఒక కాలేజీలో చదువుతున్నారు. ఆమె ఇంతకు ముందు సీఏఏ వ్యతిరేక ర్యాలీలో కన్నడ భాషలో ఇచ్చిన ప్రసంగంతో చర్చల్లో నిలిచింది. ఫేస్‌బుక్‌లో పరిచయం చేసుకుంటూ తను కొప్పాలో నివసిస్తానని, బెంగళూరు ఎన్ఎంకేఆర్వీ కాలేజ్ ఫర్ విమెన్‌లో చదువుతున్నానని చెప్పారు.
 
ఒవైసీ ఈ నినాదాలపై ఏమన్నారు?  
ఈ ఘటనపై ఆగ్రహించిన ఒవైసీ తర్వాత 'పాకిస్థాన్ ముర్దాబాద్' నినాదాలు చేశారు. ఉదారవాదులపై విరుచుకుపడ్డారు. "నేను ఈ సోకాల్డ్ లిబరల్స్‌కు చెబుతున్నా. మీరు మీ షాహీన్‌బాగ్, బిలాల్ బాగ్ తయారు చేసుకోండి. మాకు వచ్చి చెప్పకండి. మీరే సమర్థులని, మేము అసమర్థులని మీరు అనుకుంటున్నారు. మాకు మీ పాట్రనైజింగ్ ఆటిట్యూడ్ (పరిరక్షణ వైఖరి) అవసరం లేదు" అన్నారు.
 
అమూల్య ఫేస్‌బుక్ పోస్ట్ 
ఆ ర్యాలీలో అమూల్య పాకిస్థాన్ అనుకూల నినాదాలు చేయడం వెనుక అసలు కారణం ఏంటి అనేది ఎవరూ తెలుసుకోలేకపోయారు. ఒవైసీ పాల్గొన్న ఈ ర్యాలీలో ఎక్కువగా ముస్లింలే ఉన్నారు. సీఏఏ-వ్యతిరేక ఆందోళనల్లో పాల్గొన్న మరో విద్యార్థి తన పేరు బయటపెట్టద్దొనే షరతుతో, "ఆమె వేదిక పైకి వెళ్లి అలా అనే ముందు, దానివల్ల ఎలాంటి చిక్కులు వస్తాయన్నది ఒక్కసారి కూడా ఆలోచించలేదు. ఇది మేము అసలు ఊహించలేదు. మాకు కాస్త విభేదాలు ఉన్నాయి. కొంతమంది ఆమెతో అలా ఉద్రేకపడిపోకు అని కూడా చెప్పారు. కానీ, ఆమె ఎవరి మాటా వినదు" అని చెప్పారు.
 
ఈ నినాదాలకు కారణం ఏంటో అమూల్య తన సోషల్ మీడియా పేజిలో వివరణ ఇచ్చారు. అందులో ఆమె హిందుస్థాన్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, అఫ్గానిస్తాన్, చైనా, భూటాన్ జిందాబాద్ అని రాసుంది. తర్వాత అదే పేజీలో "ఈ దేశాలకు జిందాబాద్ అంటున్నాను కాబట్టి, నేను వీటిలో ఏ దేశానికీ చెందిన దాన్ని కాను. చట్ట ప్రకారం నేను ఒక భారత పౌరురాలిని. నా దేశాన్ని గౌరవించడం, దేశ ప్రజల కోసం పనిచేయడం నా కర్తవ్యం. నేను అదే చేస్తాను. ఈ ఆర్ఎస్ఎస్ వాళ్లు ఏ చేస్తారో చూడాలి. సంఘ్ వారు దీనితో కంగారు పడిపోతారు. మీరు కామెంట్స్ పెడుతూనే ఉండండి. నేను ఏం చెప్పాలో, అది చెబుతాను" అన్నారు.
webdunia
 
అమూల్య ఇంటిపై దాడి, తండ్రితో దురుసు ప్రవర్తన 
సోషల్ మీడియాలో ఇది వైరల్ కావడంతో కొంతమంది చిక్‌మగళూరులో ఉన్న అమూల్య ఇంటికి వెళ్లి, ఆమె తండ్రితో దురుసుగా ప్రవర్తించారు. వీడియోలో అమూల్య తండ్రితో 'భారత్ మాతాకీ జై' అనిపించడం కనిపిస్తోంది. ఆయనతో 'నేను నా కూతురిని సరిగా పెంచలేదని' కూడా చెప్పించారు. వారు ఆయనతో మీ కూతురికి బెయిల్ దొరకదని, ఆమె ఎక్కువ కాలం జైల్లోనే ఉండాల్సి వస్తుందని కూడా చెప్పారు.
 
బీబీసీతో మాట్లాడిన అమూల్య తండ్రి ఓస్వాల్డ్ నోరోనాహ్, "నాకు వాళ్లు ఎంతమందో తెలీదు. కానీ, నేను ఇంట్లో నుంచి బయటికి రాగానే వాళ్లు దాడి చేశారు. నేను ఇంట్లోనే ఉండుంటే, ప్రాణాలతో ఉండేవాడిని కానేమో. ఇంటిపై దాడి చేసే ముందు వాళ్లు నాతో దురుసుగా ప్రవర్తించారు. నా కూతురి గురించి అడిగారు. నేను వెంటనే పోలీసులకు పిర్యాదు చేశాను. రోడ్డు సరిగా లేక పోలీసులు రావడం ఆలస్యం అయింది అన్నారు.
 
"అమూల్య తండ్రి ఫిర్యాదుతో మేం కేసు నమోదు చేశాం. ఆయన్ని ఇబ్బంది పెట్టిన వారు బజరంగ్ దళ్ వారు కాదని చెబుతున్నారు" అని చిక్‌మగళూరు ఎస్పీ హరీశ్ పాండేయ్ బీబీసీకి చెప్పారు.
 
ఓస్వాల్డ్ నోరోనాహ్ రైతు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ప్రచారం కూడా చేశారు. "నా ఇంటిపై దాడి చేసిన వారు, నాతో దురుసుగా ప్రవర్తించిన వారు బీజేపీకి సంబంధించిన వారు. వారు మా ఊరి వాళ్లే. మా ఇంటిపై దాడి చేసిన సమయంలో కొంతమంది బయటివాళ్లు కూడా వచ్చుండచ్చు. పోలీసులు నాకు వెంటనే భద్రత ఏర్పాటు చేశారు" అని చెప్పారు.
 
అమూల్య తండ్రి వివరాల ప్రకారం ఆయన కూతురు బెంగళూరులో చదువుకుంటోంది. ఆమె మంచి విద్యార్థి. కానీ, సీఏఏ వ్యతిరేక ప్రదర్శనలు ప్రారంబమైనప్పటి నుంచి చదువుపై ధ్యాస తగ్గింది. ఆయన చాలాసార్లు అమూల్యతో చదువుపై దృష్టి పెట్టమన్నారు. "మళ్లీ చదువు మీద దృష్టి పెడతానని అమూల్య మాట ఇచ్చాక నేను వారం క్రితం బెంగళూరు నుంచి వచ్చాను" అని ఆయన బీబీసీతో చెప్పారు.
 
అమూల్య నినాదాలు చేసిన తర్వాత బీజేపీకి సంబంధించిన ఏబీవీపీ, మిగతా చాలా సంస్థలు బెంగళూరు టౌన్‌హాల్, మిగతా జిల్లాల్లో ప్రదర్శనలు నిర్వహించాయి. అమూల్య తండ్రి ఒక వీడియో వాట్సాప్‌లో వైరల్ అవుతోంది. అందులో కొంతమంది కార్యకర్తలు అమూల్య తండ్రిని ఆయన ఇంట్లోనే విచారిస్తున్నారు. ఆయనతో కెమెరా దగ్గర ప్రకటన రికార్డ్ చేయిస్తున్నారు.
 
బజరంగ్ దళ్ ఇప్పటివరకూ వారు తమ కార్యకర్తలే అని స్పష్టం చేయలేదు. అయితే, వారిలో కొంతమంది అనధికారికంగా బజరంగ్‌దళ్‌కు సంబంధించిన వారని తెలుస్తోంది. "ఇలాంటి నినాదాలు చేసినందుకు ఆమెకు ఆరు నెలల జైలు శిక్ష విధించాలని" వారు చెప్పినట్లు కొన్ని పత్రికల్లో ప్రకటనలు కూడా వచ్చాయి. 
 
బీజేపీ నేతల స్పందన ఏంటి 
బీజేపీ ఈ ఘటనపై వెంటనే స్పందించింది. బీజేపీ జాతీయ ఆర్గనైజింగ్ సెక్రటరీ బీఎల్ సంతోష్, మాజీ మంత్రి అనంత్ హెగ్డే, ఎంపీ శోభా కరందల్జే, కర్ణాటక మంత్రి సీటీ రవి నుంచి బీజేపీకి సంబంధించిన అన్ని సంస్థలూ సీఏఏ వ్యతిరేక ప్రదర్శన చేస్తున్న వారిపై మాటల దాడి మొదలెట్టాయి. వీరిలో చాలా మంది ఆమెను దేశద్రోహి అన్నారు. కొంతమంది పాకిస్థాన్ మద్దతుదారులు భారత్‌లో అశాంతి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని రాశారు.
 
బీఎల్ సంతోష్ తన ట్విటర్‌లో యాంటీ సీఏఏ ప్రొటెస్ట్ అని చెబుతున్న ఈ పిచ్చితనం చూడండి. బెంగళూరులో ఒక లెఫ్ట్ యాక్టివిస్ట్ 'పాకిస్తాన్ జిందాబాద్' నినాదాలు చేస్తోంది. అసాంఘిక శక్తులు వ్యతిరేక ప్రదర్శలను కబ్జా చేశాయి. 'ఇక చేసింది చాలు' అనాల్సిన సమయం వచ్చింది అని పెట్టారు.
 
"ఆరోపిత విద్యార్థి కార్యకర్త హిడెన్ ఎజెండా బయటకొచ్చింది. అమూల్య లియోనా, బెంగళూరు ఎయిర్‌పోర్టులో జాతీయవాది మహేష్ విక్రం హెగ్డేతో దురుసుగా ప్రవర్తించింది. ఆమె సీఏఏ వ్యతిరేక ర్యాలీలో 'పాకిస్థాన్ జిందాబాద్' నినాదాలు చేస్తూ పట్టుబడింది. ఈ ఆందోళన సీఏఏకు వ్యతిరేకంగా కాదు. ఇది పాకిస్థాన్ మద్దతుదారులు దేశంలో అశాంతి సృష్టించేందుకు చేస్తున్న కుట్ర" అని ఎంపీ శోభా కరందల్జే ట్వీట్ చేశారు. శోభా ప్రస్తావించిన మహేశ్ 'పోస్ట్‌కార్డ్ కన్నడ' ఎడిటర్. మంగళూరు ఎయిర్‌పోర్టులో ముగ్గురు మహిళలు విక్రమ్‌ను వందేమాతరం వినిపించాలని అడిగారు. వారిలో అమూల్య ఒకరు. 
 
ఇలాంటి నినాదాల వల్ల సీఏఏ వ్యతిరేక ప్రదర్శనలపై ఎలాంటి ప్రభావం పడుతుంది?
జైన్ యూనివర్సిటీ డిప్యూటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ సందీప్ శాస్త్రి బీబీసీతో "ఇవి అక్కడక్కడా వినిపించేవి అని నేను భావిస్తున్నాను. కానీ ఇలాంటి గళాలే పునరేకీకరణకు కేంద్రంగా మారుతాయి. మనం అలా జరగడం చూశాం. వాటి వల్ల మన దృష్టి అసలు అంశం నుంచి నేపథ్యంలో ఉన్న వాటిపై పడుతాయి. ముఖ్య అంశాలు చాలా సున్నితంగా ఉంటాయి. 
 
తప్పో, ఒప్పో ఇప్పుడు అవసరమైన చర్చపై ఫోకస్ ఉంచాలి. కానీ ఇంతకు ముందు కూడా జరిగినట్లు అసాంఘిక శక్తుల ద్వారా ఇలాంటి నినాదాలు చేయిస్తే, సీఏఏ వ్యతిరేక ప్రదర్శనలను దేశద్రోహం లేదా పాకిస్థాన్‌ అనుకూలమైనవిగా చెబుతారు" అన్నారు. "నేను ఈ నినాదాలను ఖండిస్తున్నాను. కానీ ఈ నినాదాలు ఆందోళనకారులందరికీ ప్రాతినిధ్యం వహించవు. అందుకే, వాటిని పట్టించుకోకూడదు" 
 
ఈ ఘటన వల్ల నిరసన ప్రదర్శనలకు దెబ్బ పడుతుందా? 
దీనిపై శాస్త్రి, "నేను అలా జరగదనే అనుకుంటున్నా. కానీ, పునరేకీకరణ చూస్తుంటే... ఈ ఆందోళనలను దెబ్బ కొట్టేందుకు ప్రయత్నం జరుగుతున్నాయనిపిస్తోంది" అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనావైరస్ సోకిన తొలి వ్యక్తి ఎవరు... జీరో పేషెంట్ అంటే ఏంటి?