సాధారణంగా చాలామందికి వయస్సు పెరిగే కొద్దీ కీళ్ళ నొప్పులు కూడా వస్తుంటాయి. ఎముకలు గట్టిపడి అవి కీళ్ళు బిగదీసుకు పోవడానికి కారణమవుతుంటాయి. ఏదో విధంగా కీళ్ళకు దెబ్బ తగలడం వలన గానీ, ఇన్ఫెక్షన్ రావడం వలన కూడా కీళ్ళ వ్యాధి వచ్చే అవకాశముంది.
ఈ నొప్పులు వచ్చే ముందు.. కొన్ని లక్షణాలు స్పష్టంగా కనిపిస్తుంటాయి. కీళ్ళు నొప్పి ఉన్న ప్రాంతంలో కందిపోయినట్లుగా కనిపించడం, వాచినట్లుగా ఉండి, వేడిగా ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే, ఈ నొప్పితో బాధపడేవారు నీరసం, తలనొప్పి, ఆకలి లేకపోవడం, జ్వరం లాంటి లక్షణాలతో బాధపడుతుంటారు.
ఉల్లిపాయ, ఆవాలు సమ భాగాలుగా తీసుకుని బాగా నూరి నొప్పిగా ఉన్న కీళ్ళమీద మర్దన చేసుకుంటే వెంటనే నొప్పులు తగ్గుతాయి. నువ్వుల నూనె ఒక కప్పు, నాలుగు వెల్లుల్లిపాయ రేకులను చిన్న ముక్కలుగా చేసి నూనెలో వేసి బాగా మరిగించుకోవాలి. నూనె చల్లారిన తరువాత వడగట్టి కీళ్ళ నొప్పులున్న చోట మర్దన చేసుకుంటే నొప్పులు తగ్గుముఖం పడుతాయి.
ఇలా మర్దన చేయడం వలన కొందరికి కీళ్ళ నొప్పులు తగ్గకుండా నొక్కడం వలన ఇంకా బాధ పెరుగుతుంది. ఇటువంటి వారు నూనెను రాసుకుని కాపడం పెడితే చాలు. కీళ్ళు స్వాధీనంలోకి వచ్చాక మర్దన చేసుకోవచ్చు. జిల్లేడు వేరు చూర్ణాన్ని వేప నూనెలో బాగా కలిపి మర్దన చేసుకున్నట్లయితే కీళ్ళ నొప్పులు తగ్గిపోతాయి.
ఇలాంటి నొప్పులు ఉన్నవారు.. కీళ్ళ మీద ఆవనూనెను.. ప్రతిరోజూ రెండు పూటలా మర్దన చేసినట్టయితే కొంతమేరకు ఉపశమనం కలిగిస్తుంది. అలాగే, సైంధవ లవణం ఒక స్పూన్, దానిమ్మ చిగుళ్ళు కొంచెం కలిపి నూరి, చేసుకుని ఒక మాత్ర చొప్పున మూడు పూటలా తీసుకుంటే కీళ్ళ వ్యాధులు తగ్గిపోతాయని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు.