Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఐసీసీ 'హాల్ ఆఫ్ ఫేమ్‌'లో పూణెలోపుట్టిన ఆసీస్ మహిళా క్రికెటర్ లీసా..

Advertiesment
Lisa Sthalekar
, గురువారం, 27 ఆగస్టు 2020 (15:55 IST)
ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో పూణెలో జన్మించిన ఓ మహిళా క్రికెటర్ చోటు దక్కించుకుంది. ఆ మహిళ పేరు లీసా స్టాలేకర్. ఓ అద్భుతమైన క్రికెటర్. ఈ ఘతన సాధించిన తొమ్మిదో మహిళా క్రికెటర్‌ కావడం గమనార్హం. ఆమె పుట్టు పూర్వోత్తరాలను పరిశీలిస్తే, 
 
మహారాష్ట్రలోని పూణె నగరంలో గత 1978, ఆగస్టు 13వ తేదీన ఓ జంటకు అందమైన పాప పుట్టింది. కానీ, ఆ పాపను పెంచే స్థోమత లేక ఆ పాపను శ్రీవత్స అనే ఆనాథ ఆశ్రమంలో వదిలివెళ్లారు. ఇతకీ ఈ పాప తల్లిదండ్రుల పేర్లు కూడా తెలియవు. కానీ, ఆశ్రమ నిర్వాహకులు ఆ పాపకు లైలా అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచారు. 
 
ఇదిలావుంటే, అమెరికాలోని మిచిగాన్‌ నుంచి హరెన్‌, సూ అనే దంపతులు భారత్‌కు వచ్చారు. ఓ బాబును పెంచుకోవాలన్న అభిలాషతో శ్రీవత్స ఆశ్రమాన్ని సందర్శించారు. నిజానికి వారు బాబునే దత్తతకు తీసుకోవాలనుకున్నారు. కాకపోతే ఎవరినైనా ఇట్టే ఆకర్షించే ఆ పాప కళ్లను ముచ్చటపడిపోయారు. మరో ఆలోచన లేకుండా ఆ పాపను అక్కున చేర్చుకున్నారు. ఇక్కడ నిబంధనల్నీ పూర్తి చేసుకుని ఆ పాపను తీసుకుని అమెరికాకు వెళ్లిపోయారు.
 
అమెరికాలో అడుగుపెట్టిన తర్వాత లైలా కాస్త లీసాగా మారిపోయింది. కొన్నాళ్లకు ఆ హరెన్‌, సూ దంపతులు అమెరికాను వీడి ఆస్ట్రేలియాకు వలస వెళ్లారు. అక్కడే సిడ్నీ నగరంలో స్థిరపడిపోయారు. హరెన్‌కు క్రికెట్‌ అంటే ప్రాణం.. ఆ ఇష్టంతోనే తన కూతురును కూడా క్రికెటర్‌ చేయాలనుకున్నాడు.. ఇంటి వెనకాల ఉన్న చిన్నపాటి స్థలంలో లీసాకు క్రికెట్‌లో మెళకువలు నేర్పాడు. ఆ తర్వాత ఇంటిదగ్గరే ఉన్న మైదానంలో శిక్షణ తీసుకుంది.
webdunia
 
అబ్బాయిలతో కలిసి ఆడింది.. ఓవైపు చదువుకుంటూనే మరోవైపు క్రికెట్‌లో రాటుదేలింది. ఆమె ప్రతిభను గమనించి న్యూ సౌత్‌వేల్స్‌ క్లబ్‌ ఆమెను సాదరంగా ఆహ్వానించింది.. ఇక అప్పట్నుంచి ఆమె వెనుదిరిగి చూడలేదు. 2001లో ఆస్ట్రేలియా తరపున తొలి వన్డే ఆడింది.. రెండేళ్లకు టెస్ట్‌ల్లోనూ అడుగుపెట్టింది. మరో రెండేళ్ల తర్వాత టీ-20 మ్యాచులూ ఆడింది.
 
సుదీర్ఘమైన క్రికెట్‌ కెరీర్‌లో లీసా నాలుగు ప్రపంచకప్‌లు ఆడింది. ఎనిమిది టెస్ట్‌ల్లో 416 పరుగులు చేయడంతో పాటు 23 వికెట్లను తీసుకుంది. 125 వన్డేలు ఆడిన లీసా అందులోనూ అద్భుతమైన ఆల్‌రౌండ్‌ ప్రదర్శన చేసింది. 2,728 రన్స్‌ ప్లస్‌ 146 వికెట్లు సాధించింది. 54 టీ-20 మ్యాచ్‌లు ఆడి 769 పరుగులు చేయడంతో పాటు, 60 వికెట్లు తీసుకుంది. వన్డేల్లో బ్యాటర్‌గా 1,000 పరుగులు చేయడంతో పాటు వంద వికెట్లు పడగొట్టిన తొలి మహిళా క్రికెటర్‌గా అరుదైన రికార్డ్‌ని కూడా నెలకొల్పింది. 
 
ఆస్ట్రేలియా జట్టుకు సారథ్యం కూడా వహించింది. క్రికెట్‌ నుంచి తప్పుకున్నాక క్రికెట్‌ వ్యాఖ్యతగా అందరి ప్రశంసలు అందుకుంది. టీమ్ కోచ్, క్రికెట్ అసోషియేషన్‌ మెంబర్‌గా బాధ్యతలను నిర్వర్తిస్తోంది.. ఐసీసీ ర్యాకింగ్‌లను ప్రవేశపెట్టినప్పుడు ఆమె నంబర్‌వన్‌ ఆల్‌రౌండర్‌గా చాలా కాలం కొనసాగింది. ఆమె సేవలను గుర్తించిన ఐసీసీ.. హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు కల్పించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆస్తమా, దీర్ఘకాలిక జ్వరాలు తగ్గేందుకు ఇలా చేస్తే చాలు