జుట్టు ఊడిపోతుందా? ఐతే ఈ చిట్కాలు పాటించండి...
చాలామంది చర్మానికి, ముఖానికి ఇచ్చే ప్రాముఖ్యతను జుట్టందానికి ఇవ్వరు. కొందరు తరచుగా షాంపూలను మారుస్తుంటారు. మార్కెట్లో దొరికే హెయిర్ ఆయిల్స్‌ను వాడుతుంటారు. ఎలా చేసినా వారి జుట్టు చుండ్రుతోనో.. మరేదో సమస్యతోనో ఊడిపోతుంటుంది. ఆడవారు ఎంత అందంగా ఉన్నా..
చాలామంది చర్మానికి, ముఖానికి ఇచ్చే ప్రాముఖ్యతను జుట్టందానికి ఇవ్వరు. కొందరు తరచుగా షాంపూలను మారుస్తుంటారు. మార్కెట్లో దొరికే హెయిర్ ఆయిల్స్‌ను వాడుతుంటారు. ఎలా చేసినా వారి జుట్టు చుండ్రుతోనో.. మరేదో సమస్యతోనో ఊడిపోతుంటుంది. ఆడవారు ఎంత అందంగా ఉన్నా... జుట్టు అందంతో వారికి మరింత అందం పెరుగుతుంది. కొన్ని రకాల జాగ్రత్తలతో జుట్టును ఒత్తుగా నిగనిగలాడేలా చేసుకోవచ్చు.
బూడిద గుమ్మడికాయ తొక్క, గింజలు కొబ్బరినూనెలో మరిగించి ఆ మిశ్రమాన్ని తలవెంట్రుకలకు రాస్తుంటే అవి సహజసిద్ధమైన మెరుపుతో తన పూర్వాకృతిని పొందుతాయి. జుట్టు మెత్తగా మారి, వెంట్రుకలు పొడవుగా అవుతాయి.
250 గ్రాముల మజ్జిగ, పది గ్రాముల బెల్లం కలిపి మిశ్రమంగా చేసుకుని తలకు పట్టించుకుని స్నానం చేస్తే చుండ్రు నివారణ అవుతుంది. నిమ్మకాయ రసంతో తలంతా మర్ధన చేసుకున్నా కూడా చుండ్రు నివారణ అవుతుంది.
మందార పువ్వులను ఎండబెట్టి కొబ్బరినూనెలో వేసి మరిగించి ఆ మిశ్రమాన్ని చల్లారాక ఒక సీసాలో నిలవచేసుకుని ప్రతిరోజూ రాసుకుంటే చుండ్రు నివారణ అవుతుంది. గోరింటాకు ఎండబెట్టి పొడిగా చేసుకుని కొబ్బరినూనెతో కలిపి రాసుకుంటే వెంట్రుకలు నిగనిగలాడతాయి.
పెరుగు, నిమ్మరసం కలిపి మిశ్రమంగా చేసుకుని వెంట్రుకలకు పట్టించినా చుండ్రు నివారణ అవుతుంది. మార్కెట్లో దొరికే కలర్ డైలను ఎక్కువగా వాడకూడదు. సాధ్యమైనంత వరకూ సహజసిద్ధంగా ఉండేలా చూసుకోవాలి. మార్కెట్లో మెహిందీ పొడి దొరుకుతుంది. దానితో సహజసిద్ధమైన డైని తయారుచేసుకుంటే మంచిది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్‌లు ఉండవు.
ఉసిరికపొడి కూడా జుట్టును నల్లగా మార్చడంలో ప్రముఖపాత్ర వహిస్తుంది. పెద్ద ఉసిరికాయలు (ఆమ్లా) చౌకగా లభ్యమయ్యేకాలంలో వాటిని తీసుకుని ఎండబెట్టి దాని పొడిని గింజలతో సహా దంచుకుని... వాటిని తలకు పట్టిస్తే చుండ్రు, పేలు నివారణ అవుతాయి. మార్కెట్లో లభ్యం అయ్యే చౌకరకాల షాంపూలను, సబ్బులను వాడితే చుండ్రు సమస్య మరింత పెరిగే అవకాశం ఉంది.