Publish Date: Thu, 08 Jan 2015 (17:19 IST)
Updated Date: Thu, 08 Jan 2015 (17:20 IST)
అప్పుడే పుట్టిన పాపాయి గుక్కపెట్టి ఏడిస్తే చాలు కంగారుపడి పోతాం... రెండు గంటలు దాటి పాలు తాగకపోయినా వెంటనే నిద్రలేపి పట్టేస్తాం. ఇవ్వొక్కటే కాదు. పిల్లల పెంపకంలో చేసే ఇలాంటి చర్యలు చాలామటుకు పొరపాట్లే అంటారు నిపుణులు.
పాపాయిలు మెలకువగా ఉన్నంతసేపూ వాళ్లు ఏడవకుండా చూస్తుంటాం. కానీ పాపాయిలు తమకున్న అసౌకర్యాన్నీ, మరేదైనా ఇబ్బందినీ ఏడుపు ద్వారానే తెలియజేస్తారు. అలాంటప్పుడు వెంటనే ఏదో ఒక విధంగా ఊరడించే ప్రయత్నం చేయడం కన్నా కారణం తెలుసుకోవాలి.
ఒళ్లు కాస్త వెచ్చగా ఉంటే చాలు ఏదో ఒక సిరప్ వేసేస్తుంటాం. కానీ కాస్త వేడిగా ఉన్నంతమాత్రాన కంగారుపడాల్సిన అవసరంలేదు. శరీర ఉష్టోగ్రత బాగా వేడిగా ఉందనుకున్నప్పుడు కొన్ని గంటలపాటు గమనించాలి. ఆ తర్వాతే వైద్యుల్ని సంప్రదించాలి. ఏదో ఒకటి వేసే ప్రయత్నం సబబు కాదు.
చాలామంది తల్లిదండ్రులు పాపాయిల నోటి ఆరోగ్యం గురించి పెద్దగా పట్టించుకోరు. అదే భవిష్యత్‌లో పళ్ల సమస్యలకు దారితీస్తుంది. అందుకే వాళ్లకు పళ్లు లేకపోయినా కూడా ప్రతీ రోజూ నోటిని శుభ్రపరచాలి. వేళ్లతోనే చిగుళ్లను రుద్ది, నోరు కడగాలి. ఆ తర్వాతే పాలు పట్టాలి. ఏడాది వచ్చాక మెత్తని టూత్‌బ్రష్‌ని వాడటం తప్పనిసరి అని చైల్డ్ కేర్ నిపుణులు సలహా ఇస్తున్నారు.